మీ అరాచకం, అహంభావానికి ఈ చర్య నిదర్శనం కాదా? ఒక ప్రజాప్రతినిధిగా పేదలకు పట్టెడన్నం పెట్టేవారిని వీలైతే ప్రోత్సహించాలి, లేదంటే నోరుమూసుకొని కూర్చోవాలి తప్ప ఈవిధంగా చేయమేమిటి? ఇళ్లస్థలాలపేరుతో కోట్లు కొల్లగొట్టడం తప్ప సేవచేయడం తెలియని మీరు చేసేవారికి అడ్డు చెప్పడమేమిటి? కేవలం రాజకీయ దురుద్దేశంతో మీరు ఆడుతున్న వికృత క్రీడను రాష్ట్రప్రజలంతా అసహ్యించుకుంటున్నారు.
ఆసుపత్రిలో రోగులకు కనీస సౌకర్యాలు లేకపోతే పట్టించుకున్న పాపాన పోని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఒక స్వచ్చంద సంస్థ పేదల ఆకలి తీర్చుతుంటే ఓర్వలేకపోవడం విచారకరం. మీరు, మీ ప్రభుత్వం అంతా సక్రమంగా చేస్తే పేదలకు ఈ కష్టాలు ఎందుకు? రాజకీయాలకు అతీతంగా శివశక్తి ఫౌండేషన్ వినుకొండలో తమ సేవలను అందిస్తోంది. దాతలు చేసే సాయాన్ని అడ్డుకోవడం ఏమిటి? రాష్ట్రంలో ఆక్సిజన్ సరిపడనంత లేకపోతే దాతలే కదా ప్రస్తుతం ఆదుకుంటున్నది.
మీ ముఖ్యమంత్రి ఈరోజు పత్రికాముఖంగా వారికి కృతజ్జతలు కూడా తెలిపారు. శివశక్తి ఫౌండేషన్ అధినేత మీ రాజకీయ ప్రత్యర్థి అయినంత మాత్రాన పేదలకు ఆకలితీర్చడానికి అందించే భోజనాన్ని అడ్డుకుని వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలిస్తారా? ఇప్పటికైనా కళ్లు తెరచి మానవత్వంతో వ్యవహరించండి, విజ్జతతో ప్రవర్తించండి. ఈ చర్యను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.