ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న నవరత్నాలలో ఒకటైన డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ హెల్త్ స్కీం - ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా కేంద్ర బృందం మంగళవారం ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆరోగ్య మిత్రల పనితీరు, హెల్ప్ డెస్క్‌ల నిర్వహణ, సీసీ కెమెరాల నిఘా, ఆసుపత్రుల్లోని పరిశుభ్రత వంటి అంశాలను క్షణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా రోగులతో అందుతున్న వైద్య సేవలు, మందుల పంపిణి తదితర అంశాలపై ఆరా తీశారు. కోవిడ్ నేపథ్యంలో ఆసుపత్రుల యాజమాన్యం రోగుల పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలను ఆరోగ్య శ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం కేంద్ర బృందానికి వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వైభవ్ జిందాల్, డాక్టర్ అస్వంత్, జేఈవో డాక్టర్ అబూబకర్ తదితరులు పాల్గొన్నారు.