నాడు తాత.. నేడు మనవరాలు : 35 ఏళ్ల తర్వాత మంత్రిగా ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే

సోమవారం, 3 ఏప్రియల్ 2017 (12:40 IST)
ఏపీ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో కర్నూలు జిల్లాకు ఒక మంత్రి పదవి దక్కింది. ఆ ఒక్కరు కూడా భూమా అఖిల ప్రియా రెడ్డి. ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే. ఈ జిల్లా నుంచి సీనియర్ నేతగా ఉన్న కేఈ కృష్ణమూర్తి ఇప్పటికే ఏపీ కేబినెట్‌లో మంత్రిగానూ, ఉప ముఖ్యమంత్రిగా పని చేస్తున్నారు. 
 
అయితే, ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే ఒకరు రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేయడం 35 యేళ్ల తర్వాత ఇదే తొలిసారి. సరిగ్గా 35 ఏళ్ల క్రితం ఎస్వీ సుబ్బారెడ్డి మంత్రి పదవి చేపట్టారు. సుదీర్ఘ విరామం తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన మనవరాలు అఖిల ప్రియ మంత్రి అయ్యారు. 
 
జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన అఖిల తల్లిదండ్రులకు మంత్రి పదవులు అందినట్లే అంది చేజారాయి. అఖిల రాజకీయ ప్రవేశం, మంత్రిగా బాధ్యతల స్వీకారం.. రెండింటి వెనుకా విషాద ఘటనలే ఉన్నాయి. ఆళ్లగడ్డ రాజకీయాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. ఆధిపత్యం కోసం జరిగే నిత్య పోరాటాల పోకడల్లో కాస్త మార్పు వచ్చినా.. తీవ్రత మాత్రం ఇప్పటికీ అదే. భూమా కుటుంబానికి నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో బలమైన వైరి వర్గాలు ఉన్నాయి.
 
పుట్టిన రోజున అఖిలకు ముఖ్యమంత్రి ఇచ్చిన కానుక మంత్రి పదవి. ఇకపై మేనమామ ఎస్వీ మోహనరెడ్డి ఆమెకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అతి పిన్న వయసులో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అఖిల భవితపై అంతటా ఆసక్తికర చర్చ నడుస్తోంది.

వెబ్దునియా పై చదవండి