అమరావతి: విజయవాడ నగరంలో బౌద్ధ విహారానికి పర్యాటక శాఖ కృషి చేస్తుందని మంత్రి భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు. బుద్ధుడి శాంతి బోధనలు మానవాళికి ఎంతో అవసరమన్నారు. విజయవాడ నగరంతో పాటు అమరావతి, భట్టిప్రోలు, ఘంటశాల వంటి క్షేత్రాలకు బౌద్ధుల రాక పెరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలో మంత్రి భూమా అఖిలప్రియతో బౌద్ధ గురువు ధలమ్మధజ భంతేజీ, విజయవాడ బుద్ధ విహార ప్రతినిధి గోళ్ళ నారాయణరావు తదితరులు సమావేశమయ్యారు.
దుష్ట శిక్షణ, సంహారం కన్నా, దుష్టుల్లో పరివర్తన తేవడం మిన్న అని, అదే బౌద్ధ ధర్మం అని భంతేజీ పేర్కొన్నారు. విజయవాడలో బౌద్ధ ధర్మానికి విస్తరించడానికి బుద్ధ విహారం ఏర్పాటు చేయాలని, దీనికి కావాల్సిన స్థలాన్నిపర్యాటకశాఖ తరఫున కేటాయించాలని భంతేజీ, గోళ్ల నారాయణరావు మంత్రి అఖిల ప్రియను కోరారు. బుద్ధుడి బోధనలతో ముద్రించిన సద్ధర్మ ఉపోస్త క్యాలండర్‌ను మంత్రి అఖిలప్రియ ఆవిష్కరించారు. బుద్ధ ధర్మ సంఘం తరఫున నరేంద్ర నాథ్ మంత్రికి కాలమ సూక్తం, ధర్మావరణం, సమ్మావాచ పుస్తకాలను బహూకరించారు.