ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు ఏకమయ్యే సమయమిదే : బీవీ రాఘవులు

ఆదివారం, 2 ఆగస్టు 2015 (14:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను దక్కించుకునేందుకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యే సమయం తరుణమిదేనని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఉన్నారు. ఆయన ఆదివారం కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ విభజన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని అన్నారు. 
 
కానీ, ప్రత్యేక హోదాపై కేంద్రం దాగుడులు మూతలాడుతోందని, అందువల్ల ప్రత్యేక హోదాను సాధించుకోవడానికి అన్ని పార్టీలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. విభజన జరిగేటప్పుడు పార్లమెంటులో మాట్లాడిన వెంకయ్య నాయుడు ఇప్పుడు తన మాట తప్పుతున్నారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని అన్నారు. ప్రత్యేక హోదాపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాతపాటే పాడటం విచారించదగ్గ విషయమన్నారు.
 
ముఖ్యంగా.. ప్రత్యేక హోదాపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ.. తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు, నేతలు ప్రజలను మభ్యపెట్టేలా ప్రకటనలు చేయడం వారికే చెల్లుతుందన్నారు. ఇలాంటి కల్లిబొల్లి ప్రకటనలతో ప్రజలను ఎంతకాలం మోసం చేస్తారని రాఘవులు ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి