రెండు తెలుగు రాష్ట్రాలనేకాకుండా దేశ రాజకీయాలను ఓ కుదుపు కుదిపిన ఓటుకు నోటు కేసు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. దీంతో ఆయన భవిష్యత్‌పై ఉత్కంఠత నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ఓటును కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన వ్యవహారంలో ఆయన చుట్టూ ఉచ్చు బిగిసినట్టేనన్న చర్చ ఊపందుకున్నది.
ముఖ్యంగా.. ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన సంభాషణ చంద్రబాబుదే అని ముంబైకి చెందిన హెలిక్ డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికతో బయటపడింది. ఈ నివేదికతో మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పిటిషన్ వేయడం, నివేదిక సమర్పించాలని ఏసీబీ డీజీని ఏసీబీ కోర్టు ఆదేశించడం తెలిసిందే.
ఆ మేరకు చంద్రబాబుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, విచారించేందుకు ఏసీబీ సిద్ధమవుతున్నదని సమాచారం. గతేడాది దాఖలుచేసిన చార్జిషీట్‌లోనూ 33 సార్లు చంద్రబాబు పేరును ఏసీబీ ప్రస్తావించింది. దీనితో ఏ విధంగా చూసినా చంద్రబాబును విచారించక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
విచారణలో చంద్రబాబు చెప్పే అంశాలను బట్టి... నివేదిక తయారు చేసి, కోర్టు ఆదేశాల మేరకు వచ్చే నెల 29వ తేదీలోపు అందించాల్సి ఉంటుందని తెలిపారు. అలా చేయని పక్షంలో కోర్టు ధిక్కరణ కింద తాము న్యాయస్థానం ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని చెప్పారు. ఇదే జరిగితే చంద్రబాబు కష్టాలు ఎదుర్కోక తప్పదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.