శుక్రవారం అధికారిక పర్యటనపై నెల్లూరు విచ్చేసిన కేంద్రమంత్రి వెంకయ్య అక్కడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నూతన భవనాల ప్రారంభం, ఎఫ్ఎం రేడియో స్టేషన్, ఇండోర్ స్టేడియంలకు శంకుస్థాపన చేసిన తర్వాత బహిరంగ సభలో మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రస్తావన, ఆయనకు వెన్నుపోటు ఘటన గురించి తల్చుకోవడం కలకలం రేపింది.
ఇంతకూ ఆయనేమన్నారంటే ‘నా వెనుక ఎవరూ ఉండొద్దు.. ఎందుకంటే 1984లో వెనుక ఉన్నవారు దివంగత ఎన్టీరామారావుకి వెన్నుపోటు పొడిచారు. అప్పటినుంచి నాకు అనుమానమే. అందుకే ముందు ఉండాలి..’, ‘ఎవరైనా సరే నా ముందు ఉంటే నేను ధైర్యంగా ఉండొచ్చు..’ అనేశారు కేంద్రమంత్రి. ఎన్టీఆర్ తొలిసారి పదవీచ్యుతుడైనప్పుడు వామపక్షాలూ, బీజేపీ వెన్నంటి నడిచి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని నడిపిన విషయం తెలిసిందే.
కానీ వెంకయ్య నాయుడు వీజీగా ఒక విషయాన్ని దాటవేశారు. 1984లో నాటి సీఎం ఎన్టీఆర్‌కు జరిగిన వెన్నుపోటు గురించే మాట్లాడారు తప్ప 1995ల జరిగిన ఘోరావమానం కానీ, సొంత అల్లుడే ఆయనను పదవీచ్యుతుడిని చేయడం కానీ వెంకయ్య ఈ బహిరంగ సభలో గుర్తుకు తెచ్చుకోలేదు. అది పొత్తు ధర్మానికి భంగం అవుతుందని చెప్పి తప్పుకున్నారేమో మరి.