అమరావతి కంటే విశాఖపట్టణమే బాగుంది : చంద్రబాబు

శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (16:49 IST)
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి కంటే విశాఖపట్ణమే బాగుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకే నవ్యాంధ్రకు ఏపీ అత్యంత కీలక నగరమన్నారు. స్మార్ట్ సిటీల అభివృద్ధికి సహకరిస్తామన్న అమెరికాతో ఒప్పందం కుదిరిన వేళ, చంద్రబాబు ప్రసంగిస్తూ, కేంద్రం ప్రకటించిన తొలి జాబితాలోనే స్మార్ట్ సిటీగా విశాఖ ఎంపికైందని గుర్తుచేశారు. 
 
అమరావతి నగరం నిర్మాణం పూర్తయ్యేసరికి ఎంతో కాలం పడుతుందని వెల్లడించిన ఆయన, ఈలోగా రాష్ట్రాభివృద్ధికి కేంద్రంగా విశాఖ నిలవనుందన్నారు. హుదూద్ తుఫాను నుంచి తేరుకుని తలెత్తుకు నిలబడ్డ నగరంలో రెండు ప్రధాన సదస్సులు జరిగాయని, అంతర్జాతీయ నావికా సమీక్ష జరిగిందని తెలిపారు. 
 
గతంలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో 40 దేశాలు పాల్గొన్నాయని ఆయన గుర్తుచేశారు. అమెరికా ప్రభుత్వం, ఆ దేశ సంస్థలతో కలసి పనిచేయడం తనకు లభించిన అద్భుతమైన అవకాశంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం 7.52 శాతంగా ఉన్న రాష్ట్రాభివృద్ధిని రెండంకెలు దాటించడమే తన ముందున్న తొలి లక్ష్యమన్నారు. 

వెబ్దునియా పై చదవండి