చంద్రబాబుతో పాటు ఆయన పార్టీ నేతలు అమరావతి విషయంలో భారీ అవినీతికి పాల్పడ్డారని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ ఇన్‌చార్జ్ సునీల్ దేవధర్ అన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాల్లోంచి రాజకీయ నేతగా మారారని, కానీ చంద్రబాబు మాత్రం తొలుత రాజకీయ నేతగా ఉండి నెమ్మదిగా నటుడిగా మారారని చురకలంటించారు.
చంద్రబాబు ఒక గజ దొంగ అని దేవధర్ వ్యాఖ్యానించారు. జీవీఎల్పై అనవసర ఆరోపణలు చేయవద్దని హితవు పలికారు. వైజాగ్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘విధి నిర్వహణలో భాగంగా ప్రధాన మంత్రిని రాష్ట్రాల ముఖ్య మంత్రులు కలవడం సహజం. దానిలో భాగంగానే ప్రధాని మోదీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలిశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుందని టీడీపీ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీతో పొత్తు పెట్టుకునే ఆలోచనే లేదు. జనసేనతో ఇప్పటికే బీజేపీ పొత్తు పెట్టుకుంది. రానున్న స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి పనిచేస్తాం.
రాష్ట్రాల అభివృద్ధి విషయంలో కేంద్రం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది. నిజానికి రాజ్యసభలో మాకు బలం లేదు. ఆర్టికల్ 370 రద్దు విషయంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ, బిజూ జనతాదళ్ పార్టీలు మాకు మద్దతు ఇచ్చాయి.
అంతమాత్రన వైఎస్సార్‌సీపీతో పొత్తు పెట్టుకున్నామని కాదు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలు పొలిటికల్ ఫైట్ మాత్రమే’అని సునీల్ దేవధర్ పేర్కొన్నారు.