శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

గురువారం, 13 సెప్టెంబరు 2018 (20:49 IST)
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన గురువారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. 
 
టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ కలిసి స్వాగతం పలికారు. ఆ తరువాత ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. 
 
వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.
 
 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీ నారా లోకేష్‌, శ్రీ అమరనాథరెడ్డి, టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి సుధా నారాయణమూర్తి, శ్రీ చల్లా రామచంద్రారెడ్డి, శ్రీ పొట్లూరి రమేష్‌బాబు, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు