మారిన చంద్రబాబు చిరునామా.. ఉండవల్లి నివాసిగా నమోదు

ఆదివారం, 30 ఆగస్టు 2015 (10:06 IST)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిరునామా మారింది. ఉండవల్లి నివాసిగా తన పేరును నమోదు చేసుకున్నారు. దీంతో శనివారం నుంచి చంద్రబాబు నివాస చిరునామా సీఎం రెస్ట్‌హౌస్‌, కరకట్ట రోడ్డు, ఉండవల్లి, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లాగా మారింది. 
 
రాష్ట్ర ప్రజల మనోభావాలను అవగతం చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల అభీష్టాలకు అనుగుణంగా... ప్రజలకు చేరువగా ఉంటూ పాలన సాగించాలని నిశ్చయించారు. అనుకున్నదే తడవుగా విజయవాడ నగరం నుంచి పాలన కొనసాగించేలా యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తూ వచ్చారు. అన్ని ముఖ్యవిభాగాధిపతుల కార్యాలయాలను దశల వారీగా విజయవాడ, గుంటూరు నగరాలకు తరలిస్తూ తన నివాసాన్ని కూడా ఇక్కడికే మార్చుకున్నారు. 
 
విజయవాడ క్యాంపు కార్యాలయానికి నిమిషాల వ్యవధిలో చేరుకునేందుకు అనువుగా రాజధాని హద్దుల్లో తన నివాసం ఉండేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఇందుకు పరిస్థితులు కూడా కలిసివచ్చాయి. గుంటూరు జిల్లా వైపు కృష్ణాతీరం వెంట ఉన్న ప్రైవేటు అతిథిగృహాల్లో ముఖ్యమంత్రి నివాసానికి అనుకూలమైందిగా అధికారులు లింగమనేని ఎస్టేట్స్‌ భవనాన్ని ఖరారు చేశారు. 
 
కొన్నాళ్లుగా ఈ భవనానికి భారీస్థాయిలో మరమ్మతులు కూడా నిర్వహిస్తున్నారు. సీడ్‌ క్యాపిటల్‌కు చేరువగా నివాసం ఉంటూ రాజధాని నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షించాలన్న ఆకాంక్షతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లి కరకట్ట వెంట నివాసాన్ని ఖరారు చేసుకున్నారు. తాజాగా శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, బంధుమిత్రులతో కలిసి శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశారు. ముఖ్యమంత్రి ఆగమనంతో మొత్తం రాష్ట్ర ప్రజల్లో రాజధాని నిర్మాణం వేగవంతం కాగలదనే విశ్వాసం నెలకొంది.

వెబ్దునియా పై చదవండి