చంద్రబాబును 2 రోజుల సీఐడీ కస్టడీకి ఇచ్చిన ఏసీబీ కోర్టు...

శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (17:04 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ లీగల్ సెల్ వెళ్లింది. సీబీఐ కస్టడీ, విచారణ గురించి చంద్రబాబుతో న్యాయవాది లక్ష్మీ నారాయణ చర్చించారు. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలోనే చంద్రబాబును విచారించాలని సీబీఐ కోర్టు నిబంధన విధించింది. 
 
అలాగే, చంద్రబాబును విచారించే అధికారుల వివరాలను ఇవ్వాలని ఆదేశించింది. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే చంద్రబాబును విచారించాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో రెండు రోజుల పాటు చంద్రబాబును సీఐడీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. వయసురీత్యా ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని, కస్టడీ ముగిసిన తర్వాత తమ ఎదుట హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు. 

ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ... 
 
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి కొట్టివేశారు. దీంతో ఇక ఏపీ హైకోర్టులో న్యాయం జరగదని భావించిన బాబు లాయర్లు సుప్రీంకోర్టులో తేల్చుకోవాలని సిద్ధమయ్యారు. 
 
క్వాష్ పిటిషన్‌పై సుధీర్ఘ వాదనలు ఆలకించిన న్యాయమూర్తి శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తన తీర్పును కేవలం ఒకే ఒక వ్యాక్యంతో వెలువరించారు. ది పిటిషన్ ఈజ్ డిస్మిస్డ్ అంటూ తీర్పు చెప్పి బెంచ్ దిగి జడ్జి వెళ్లిపోయారు. ఈ తీర్పుతో స్కిల్ కేసులో సీఐడీ వినిపించిన వాదనలు హైకోర్టు సమర్థించినట్టయింది. తీర్పు కాపీ అందుబాటులోకి వస్తే జడ్జి ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పును వెలువరించారనే విషయం అర్థమవుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు