‘అవినీతి చేస్తున్న రాజకీయ నాయకులకి యువత అంటే భయం. మార్పు యువతతోనే వస్తుందన్న భయం. తమను మార్చేస్తారన్న భయం. అందుకే ఓట్లు తీసేస్తున్నార’ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పారు. యువత మనతో లేరన్న భయం అవినీతి చేస్తున్న నాయకుల్ని వెంటాడుతుందన్నారు. మార్పు మొదలైనప్పుడు దాన్ని ఎవరూ అడ్డుకోలేరన్న విషయం ఈ మూర్ఖులకి అర్ధం కావడం లేదన్నారు. మంగళవారం అమలాపురం సత్యనారాయణ కళ్యాణ మండపంలో విద్యార్ధినీవిద్యార్ధులతో సమావేశమయ్యారు.
ఈ సందర్బంగా వారు అడిగిన పలు ప్రశ్నలకి పవన్ కళ్యాణ్ బదులిస్తూ… “చచ్చుబడిన జీవశ్చవాల్లా మారిన నాయకులకి యువత అంటే భయం. యువత మారాలి అనుకుంటే, ఓట్లు తీసేసినా, పదిమందిని చంపినా మార్పు వచ్చి తీరుతుంది. చరిత్రలో ప్రజల హక్కులు హరించి, భయపెట్టి పాలిద్దామనుకున్న నాయకులు దిక్కుమాలిన చావు చచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓట్లు తీసేశారు.. ప్రాణాలు తీయలేరు. ప్రజాస్వామ్య పరిరక్షణకి నా వంతు కృషి చేస్తాను. మీ ఓటుని మీరు కాపాడుకుంటే చాలు, అవినీతిని తరిమేయవచ్చు. అన్యాయాన్ని అరికట్టవచ్చు. టీడీపీ-వైసీపీలని పక్కనపెట్టవచ్చు.
వారానికి ఒకసారి చూసుకోండి మీ ఓట్లు ఉన్నాయో? లేదో.? మీ హక్కు కోసం మీరు పోరాటం చేయండి. సోషల్ మీడియా ద్వారా పోరాడండి. అధికారులకి విజ్ఞప్తి చేయండి. నాకు ఓటమి భయం లేదు. ఒక్క ఎన్నికల కోసం రాలేదు. 25 ఏళ్ల పాటు పోరాటం చేసేందుకు వచ్చా. నాయకత్వం అంటే పదిమందిని ప్రభావితం చేయాలి. మన ఆలోచనని సమగ్రమైన విలువలతో కూడిన ఆలోచనల్ని, భావాన్ని పది మందిలోకి తీసుకువెళ్లాలి. నాణ్యతతో కూడిన ఆలోచనా విధానాన్ని పాటిస్తే నాయకులు అయిపోతారు. నాయకులు కావాలంటే పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలి, ఒత్తిడి తీసుకోగలగాలి. ధైర్యం-త్యాగం కావాలి. ఎన్నో ఎదురు దెబ్బలు తినాలి. ఓర్పు కావాలి. ఇవన్నీ చేయాలంటే ముందు బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకున్నప్పుడు శక్తి వస్తుంది.