ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ పేరు.. చిరంజీవి ప్రశంసలు

గురువారం, 25 మార్చి 2021 (15:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులో మరో విమానాశ్రయం వచ్చింది. దీన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ విమానాశ్రయానికి తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పేరు పెట్టారు. రూ.110 కోట్లతో అన్ని హంగులతో ఎయిర్ పోర్టును తీర్చిదిద్దారు.
 
ఈ తర్వాత ఓర్వకల్లు ఎయిర్ పోర్టును జాతికి అంకితం చేశారు. న్యాయ రాజధానికి రాకపోకలు సాగేలా ఈ ఎయిర్ పోర్టు ఉపయోగపడుతుందంటూ పరోక్షంగా రాజధాని తరలింపుపై జగన్ సంకేతాలిచ్చారు. పనిలో పనిగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
 
రాష్ట్రంలో ఇది ఆరో విమానాశ్రయమని, న్యాయ రాజధాని నుంచి మిగతా రాష్ట్రాలకు ఓర్వకల్లు విమానాశ్రయం కలుపుతుందని సీఎం జగన్ అన్నారు. ఎన్నికలకు నెల రోజుల ముందు.. ఎలక్షన్‌లో లబ్ది పొందేందుకు చంద్రబాబు ఓర్వకల్లు ఏయిర్ పోర్టును ప్రారంభించారని విమర్శించారు.
 
దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుపెడుతున్నట్టు సీఎం జగన్ ప్రకటించడంతో తన హృదయం సంతోషంతో ఉప్పొంగిపోయిందన్నారు.
 
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెల్లదొరలపై పోరాట బావుటా ఎగురవేసిన మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడని చిరంజీవి గుర్తుచేశారు.
 
ఉయ్యాలవాడ అత్యంత గొప్ప దేశభక్తుడని, అయితే చరిత్రలో మరుగునపడిపోయాడని వివరించారు. అలాంటి వీరుడి పేరు ఎయిర్ పోర్టుకు పెట్టడం అత్యంత సముచిత నిర్ణయమని కొనియాడారు. 
 
కాగా, అంతటి యోధుడి పాత్రను తెరపై తాను పోషించడం తనకు దక్కిన అదృష్టంగా, గౌరవంగా భావిస్తానని చిరంజీవి పేర్కొన్నారు. ఉయ్యాలవాడ జీవితకథతో వచ్చిన 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో చిరంజీవి టైటిల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు