కొందరు మగరాయుళ్ళు మృగరాయుళ్లుగా మారిపోతున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి భార్య ఉన్నప్పటికీ మరదలిపై కన్నేశాడు. ఆమెకు పెళ్లి నిశ్చయం కావడాన్ని జీర్ణించుకోలేక పోయాడు. అంతే.. ఆమె నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణం చిత్తూరు జిల్లా ములకల చెరువు, సోంపల్లెలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ములకలచెరువు మండలం సోంపల్లె పంచాయతీ గట్టుకిందపల్లెకు చెందిన కదిరి శివన్న, నరసమ్మ దంపతులకు అరుణ, మాధవి, సుమతి కుమార్తెలు. వీరిలో మాధవికి తొమ్మిదేళ్ళ క్రితం వివాహమైంది. కర్ణాటక రాష్ట్రం బేగూరుకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు.
బావ వేధింపులు భరించలేక ఆరు నెలల కిందట సుమతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అప్పట్లో మదనపల్లె టూటౌన్ పోలీసులు వెంకటేష్‌కు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో మరదలికి వేరే వ్యక్తితో పెళ్లి కుదిరిందని తెలియాన్ని జీర్ణించుకోలేక పోయాడు. ఆమెకు మదనపల్లె మండలం చీకలబైలు పంచాయతీ జవకలపల్లెకు చెందిన ఓ యువకుడితో ఈ నెల 25న వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి వరకు ఇంటికి రంగులు వేశారు.
ఈ క్రమంలో.. వరండాలో నిద్రిస్తున్న సుమతిపై గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రెండో అక్క భర్త వెంకటేశ్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటలు భరించలేక ఆమె హాహాకారాలు చేస్తూ పశువులు నీళ్లుతాగే తొట్టెలోకి దూకొంది. ఈ లోగా ఇంటికి కాపలాగా ఉన్న రెండు కుక్కలు, ఇంటి వెనుక కుక్క చనిపోవడాన్ని కూడా స్థానికులు గుర్తించారు.
నిందితుడు అన్నంలో విషం కలిపి కుక్కలకు పెట్టడంతో వాటితోపాటు ఒక పిల్లి చనిపోయాయి. తెల్లవారాక ఆ విషాహారం తిన్న 30 కోళ్లు మృతి చెందాయి. బాధితురాలిని తొలుత మదనపల్లె జిల్లా ఆస్పత్రికి, తర్వాత తిరుపతి రుయాస్పత్రికి పంపారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.