సెంటిమెంట్‌ రాజేసే ధోరణిలోనే తెలంగాణ సర్కారు : చంద్రబాబు

శనివారం, 23 మే 2015 (12:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన అనంతరం ఏర్పడిన సమస్యలను సావధానంగా పరిష్కరించుకునే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించేలా లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఫలితంగానే విభజనకు సంబంధించిన వివిధ అంశాల్లో ఏర్పడిన సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ‘ఇంకా ప్రజల మధ్య సెంటిమెంట్‌ను రాజేసే ధోరణి వారిలో కనిపిస్తోంది. ఇక్కడ ఆంధ్రా వర్సెస్‌ తెలంగాణ ఇష్యూ కాదు. పరస్పరం సహకరించుకునే విషయంలో కలిసి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు’ అని అన్నారు. ఉభయ ప్రభుత్వాలు కలిసి కూర్చుని మాట్లాడుకొంటే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని, కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆ సహకారం అందటం లేదని వాపోయారు.
 
ఏపీ సర్కారు చేపట్టే నవ నిర్మాణ దీక్ష తెలంగాణ ప్రజలకు వ్యతిరేకం కాదన్నారు. ‘విభజన జరిగిన తీరు ఏపీ ప్రజల మనసులను గాయపర్చింది. జరిగిన తీరును మనం వ్యతిరేకిస్తున్నాం తప్ప తెలంగాణ ప్రజల మనోభావాలను కాదు. కొత్త రాష్ట్రాన్ని మళ్లీ వైభవోపేతంగా తీర్చిదిద్దుకోవడానికి మనకు మనం సంకల్పం చెప్పుకోవడానికే నవ నిర్మాణ దీక్ష. విభజన జరిగిన తీరులో అన్యాయాలు, కష్టనష్టాలను చెబుదాం తప్ప తెలంగాణ ప్రజలను మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. వారు మన సోదరులు. మానసికంగా కలిసి ఉందాం. భౌతికంగా పరస్పరం పోటీపడి అభివృద్ధి చెందుదాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి