అసెంబ్లీ బిల్లులపై కసరత్తు... సర్కారు ఉద్దేశాలు కనిపించాలన్న సీఎం
బుధవారం, 10 జులై 2019 (06:43 IST)
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లులు, దానిపై జరిగిన కసరత్తును ముఖ్యమంత్రి వై.యస్.జగన్ సాయంత్రం అధికారులతో సమీక్షించారు. కొత్తగా చట్టాలను తీసుకురావడంతో పాటు, ఇదివరకు చేసిన చట్టాల్లో సవరణలకోసం ఉద్దేశించిన బిల్లులు ఇప్పటికే తుదిరూపు దిద్దుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వై.యస్.జగన్ అధికారులతో సమావేశం అయ్యారు.
మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఈ బిల్లులు రూపొందబోతున్నాయి. 14నెలల సుదీర్ఘ పాదయాత్ర సమయంలో అంతకంతకూ పెరిగిపోతున్న స్కూలు ఫీజులపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సామాజిక వేత్తలనుంచి పెద్ద ఎత్తున అర్జీలు, ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ ప్రమాణస్వీకారం చేసిననాటినుంచి దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టారు.
దీంట్లో భాగంగా ఒక సమర్థవంతమైన చట్టాన్ని తీసుకురావాలని సీఎం ఆదేశాల నేపథ్యంలో స్కూలు, కాలేజీల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు ఒక చట్టం చేయబోతున్నారు. దీనికోసం తయారుచేసిన బిల్లుపై అధికారులతో సీఎం వివరంగా మాట్లాడారు. అలాగే పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలను స్థానికులకు కల్పించేదిశగా మరొక చట్టాన్ని తెచ్చేందుకు ఉద్దేశించిన బిల్లుపై కూడా సీఎం అధికారులతో మాట్లాడారు.
కౌలు రైతులకు అండగా ఉంటామని మేనిఫెస్టోలో చెప్పిన మీద రైతు భరోసాను వారికి అందిస్తామని ఇదివరకే ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. దీంట్లో భాగంగా భూ యజమానులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, పంటపై 11 నెలలపాటు సాగు ఒప్పందం చేసుకునేందుకు వీలు కల్పించేలా మరొక చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.
ఈ ముసాయిదా బిల్లుపై కూడా సీఎం వైయస్.జగన్ అధికారులతో సమీక్షించారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయడంతోపాటు, నామినేటెడ్ పోస్టుల్లో యాభైశాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందేలా ఉద్దేశించిన బిల్లునూ ఈ శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెడుతున్నారు. తద్వారా ఆయా వర్గాలకు ఈ చట్టంద్వారా పెద్ద ఎత్తున రాజకీయప్రాధాన్యత కల్పించబోతున్నామని ముఖ్యమంత్రి ఇదివరకే స్పష్టంచేశారు.
వీటితోపాటు మరికొన్ని బిల్లులపై కూడా సీఎం అధికారులతో చర్చించారు. రూపొందించే ప్రతి బిల్లులో ప్రభుత్వ ఉద్దేశాలు, తీసుకురాబోతున్న చట్టాలు వల్ల ప్రజలకు ఏవిధంగా ప్రయోజనం కలగబోతుందన్న అంశాలను స్పష్టంగా పేర్కొనాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.