24 నుంచి చిలకలూరిపేటలో పూర్తి లాక్‌డౌన్.. ఈ నెలాఖరు వరకు కొనసాగింపు
బుధవారం, 22 జులై 2020 (15:33 IST)
ఈ నెల 24 నుంచి నెలాఖరు వరకు చిలకలూరిపేట పట్టణంలో సంపూర్ణలాక్‌డౌన్ అమలు చేయాలని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని అధికారులను ఆదేశించారు. పట్టణంలో కరోనా ఉధృతమవుతున్న నేపథ్యంలో బుధవారం ఆమె కంటైన్‌మెంట్ జోన్ ప్రాంతాల్లో పర్యటించారు.
మున్సిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కోవిడ్ నుంచి ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని తెలిపారు. అధికారులు పట్టణంలో ఈ నెల 24 నుంచి లాక్‌డౌన్ అమలుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఈ నెల 24 నుంచి పట్టణంలో కేవలం పాలు, కూరగాయల దుకాణాలు మాత్రమే తెరిచి ఉంటాయని, అది కూడా ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రజలంతా సహకరించాలని కోరారు.
ఈ శుక్రవారం లోపే ప్రజలకు వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు మొత్తం తెచ్చి పెట్టుకోవాలన్నారు. 24 నుంచి అనవసరంగా వీధుల్లో తిరిగితే అధికారులు చర్యలు తీసుకుంటారని,ఎటువంటి సిపార్సులు ఉండవని చెప్పారు ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్ పాటించాలని కోరారు.
శుక్రవారం నుంచి పట్టణంలో ఎలాంటి దుకాణాలు తెరిచి ఉంచడానికి వీల్లేదన్నారు. నిబంధనలు పాటించనివారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించేవారు ఎంతటివారైనా పోలీసులు చర్యలు తీసుకుంటారని స్పష్టంచేశారు.
ఈ నెల 24 నుంచి పట్టణంలో కేవలం పాలు, కూరగాయలు, ఇళ్ల మధ్య ఉండే చిన్న చిన్న షాపులు మాత్రమే కేవలం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయని వెల్లడించారు. ప్రజలంతా అధికారులకు సహకరించాలన్నారు.
కార్యక్రమంలో కమిషనర్ సీహెచ్ శ్రీనివాసరావు, సీఐ వెంకటేశ్వర్లు, చిలకలూరిపేట మార్కెట్ యార్డు చైర్మన్ బొల్లెద్దు చిన్న, పార్టీ పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహాఖాన్, కొలిశెట్టి శ్రీనివాసరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.