ఏపీపై కరోనా పడగ..ఎంపీ ఇంట్లో ఆరుగురికి, రాజ్ భవన్ లో నలుగురు సిబ్బందికి

సోమవారం, 27 ఏప్రియల్ 2020 (05:15 IST)
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజులోనే కొత్తగా 81 కేసులు బయల్పడ్డాయి. ఇందులో ఒక్క కృష్ణా జిల్లాలో నే 52 వుండడం తీవ్ర ఆందోళన రేపుతోంది. మరోవైపు కర్నూలు జిల్లాకు చెందిన ఒక ఎంపీ ఇంట్లో ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. తాజాగా రాజ్‌భవన్‌ కూడా వైరస్‌ బారిన పడింది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న నలుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది.

సిబ్బందిలో కొందరికి అనుమానిత లక్షణాలు కనిపించడంతో గవర్నర్‌ సహా 8 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. వారిలో నలుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వైద్యసిబ్బంది ఒకరి ద్వారా వ్యాధి వ్యాప్తి చెందినట్లు అనుమానిస్తున్నారు.
 
రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 6768 శాంపిల్స్‌ పరీక్షించగా వాటిలో 81 కేసులు కరోనా పాజిటివ్‌గా తేలాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్‌–19 కేసుల సంఖ్య 1097 కు చేరింది. 

కర్నూలు జిల్లాలలో అత్యధికంగా 279 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 214, కృష్ణా జిల్లాలో 177, చిత్తూరు జిల్లాలో 73, నెల్లూరు జిల్లాలో 72, వైయస్సార్‌ కడప జిల్లాలో 58,  ప్రకాశం జిల్లాలో 56, అనంతపురం జిల్లాలో 53, పశ్చిమ గోదావరి జిల్లాలో 51, తూర్పు గోదావరి జిల్లాలో 39, విశాఖపట్నం జిల్లాలో 22, శ్రీకాకుళం జిల్లాలో 3 కేసులు గుర్తించారు. విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క  కేసు కూడా నమోదు కాలేదు.

కరోనా వైరస్‌కు చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి 231 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 31 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ కాగా, ఆ తర్వాత కృష్ణా, గుంటూరు జిల్లాలలో 29 మంది చొప్పున, వైయస్సార్‌ కడప జిల్లాలలో 28 మంది,  ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో 23 మంది చొప్పున, విశాఖపట్నం జిల్లాలో 19 మంది, అనంతపురం జిల్లాలలో 14 మంది, చిత్తూరు జిల్లాలో 13 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 12 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 10 మంది.. మొత్తం 231 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. 

ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ఆస్పత్రుల్లో 835 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఇప్పటి వరకు 31 మంది చనిపోయారు. కర్నూలు జిల్లాలో 9 మంది, గుంటూరు, కృష్ణా జిల్లాలలో 8 మంది చొప్పున, అనంతపురం జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు చనిపోయారు.  
 
జిల్లాలలో కోవిడ్‌–19 నివారణ చర్యలు:
 
శ్రీకాకుళం జిల్లా:
జిల్లాలో ఇప్పటి వరకు 4 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 3576 శాంపిల్స్‌ నెగటివ్‌గా తేలాయని ఉప ముఖ్యమంత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్‌ (ఆళ్ల నాని) తెలిపారు. జిల్లాలో తొలిసారిగా కోవిడ్‌–19 కేసులు నమోదు కావడంతో ఆదివారం అక్కడ పర్యటించిన ఆయన, పరిస్థితిని సమీక్షించారు. కరోనా పాజిటివ్‌ గుర్తించిన వారికి జిల్లా కోవిడ్‌ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నామని, ఈ వ్యాధి గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 

జిల్లాకు విదేశాల నుంచి 1445 మంది రాగా, వారితో 4271 మంది కాంటాక్ట్‌ అయ్యారని, అలాగే ఢిల్లీ నుంచి 230 మంది, ముంబై నుండి మరో 488 మంది వచ్చారని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో ఒకరికి కరోనా సోకినట్లు తేలిందని, ఆ వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించి, జిల్లాల వైరస్‌ వ్యాప్తి చెందకుండా అధికార యంత్రాంగం కృషి చేస్తోందని చెప్పారు. ప్రజలు కూడా ప్రభుత్వ మార్గదర్శకాలు అమలు చేయాలని, అన్ని జాగ్రత్తలు పాటించాలని
సూచించారు.

నిత్యావసరాల కోసం ఇంటి నుంచి కేవలం ఒక్క మనిషి మాత్రమే  బయటకు రావాలని, అలా వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని మంత్రి కోరారు. జిల్లాలో కరోనా వైరస్‌ పరీక్షల కోసం ల్యాబ్‌ ఏర్పాటు చేశామని, ఇంకా ర్యాపిడ్‌ కిట్స్, ట్రూనాట్‌ కిట్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయని, వీటన్నింటి ద్వారా ఆర్‌టిపిసిఆర్‌ పరీక్షలు జిల్లాలోనే నిర్వహిస్తామని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు.

జెమ్స్‌ ఆస్పత్రిని జిల్లా కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చి, తగిన ఏర్పాట్లు చేశామని, ఇంకా 32 క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి, వాటిలో పూర్తి సౌకర్యాలు కల్పించామని చెప్పారు. క్వారంటైన్‌ కేంద్రాలలో ప్రతి ఒక్కరిపై రోజుకు రూ.500 వ్యయం అవుతాయని తెలిపారు. జిల్లాలో పాతపట్నం ప్రాంతాన్ని రెడ్‌ జోన్‌గా ప్రకటించడమే కాకుండా, ముందు జాగ్రత్తగా 50 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి జిల్లాలోకి ఇతర ప్రాంతాల వారు ప్రవేశించకుండా నిరోధిస్తామని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. 
 
విజయనగరం జిల్లా:
కరోనా కాటుకు బలై రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితుల్లో విజయనగరం జిల్లా మాత్రం నేటికీ సురక్షితంగానే ఉంది. దీనివెనుక జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ పకడ్బందీ వ్యూహం, దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు తగిన అధికార యంత్రాంగం తోడ్పాటు ఉన్నాయి. జిల్లాను సేఫ్‌గా ఉంచడంలో కలెక్టర్‌కు వివిధ శాఖలు పూర్తి అండగా నిలుస్తున్నాయి. అందరినీ సమన్వయం చేయడంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌ నేతృత్వంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ కీలకపాత్ర పోషిస్తోంది.

రాష్ట్రంలో కరోనా తొలి కేసు బయట పడగానే అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం, అసిస్టెంట్‌ కలెక్టర్‌ కేతన్‌ ఆధ్వర్యంలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించింది.  జిల్లా కలెక్టర్‌ సూచనల మేరకు కేతన్‌ పలు ప్రత్యేక కార్యక్రమాలను ఈ సెంటర్‌ ద్వారా అమలు చేస్తున్నారు.

కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ సారధిగా  డేటా సేకరణ, విశ్లేషణకు ఆయన అధిక ప్రాధాన్యతనిచ్చి,  దానికి అనుగుణంగా క్షేత్రస్థాయి పనితీరుకు వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ ఆలోచనలను పసి గట్టి, జిల్లా అవసరాలకు తగినట్టుగా వాటిని అన్వయించి,  ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం ద్వారా ఇప్పటివరకు మంచి ఫలితాలను రాబట్టారు.

జిల్లాలో కరోనా కట్టడిలో సత్ఫలితం ఇచ్చిన ఏడంచెల వ్యూహాన్ని రూపొందించి అమలు చేస్తున్నది కూడా ఈ కంట్రోల్‌ రూమ్‌ ద్వారానే. ఈ కేంద్రం ద్వారా సర్వైలెన్స్, కాల్‌ సెంటర్‌ మానిటరింగ్, డేటా విశ్లేషణ,  పోలీసులతో సమన్వయం,  జిల్లాలోని కోవిడ్‌ ఆసుపత్రుల్లో సన్నద్ధతను పర్యవేక్షించడం, అలాగే పౌరసరఫరాల వ్యవస్థ పనితీరును గమనించడం, కరోనా నియంత్రణకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, వాటికి సంబంధించిన నివేదికలను కూడా తయారు చేయడం కమాండ్‌ కంట్రోల్‌ రూము ముఖ్య విధులుగా చెప్పవచ్చు.

ఇంకా ఇంటింటి కుటుంబ ఆరోగ్య సర్వే బృందాలు ఇచ్చిన నివేదికలను విశ్లేషిస్తూ,  కొత్తకొత్త ప్రణాళికలను రూపొందించడంలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ తెరవెనుక చేస్తున్న కృషి కూడా ఎంతో ఉంది.  ఇంటింటా నిర్వహించిన సర్వేలో డేటాను విశ్లేషించడం,  అనుమానితులను క్వారంటైన్‌కు తరలించడం, అవసరమైన వారికి నిర్ధారణా పరీక్షలు నిర్వహించడం, నివేదికలను తయారు చేసి, జిల్లా కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి పంపించడం తదితర కీలక కార్యక్రమాలన్నీ కమాండ్‌ కంట్రోల్‌ రూము ద్వారానే జరుగుతున్నాయి.
 
పశ్చిమ గోదావరి జిల్లా:
కరోనా వైరస్‌కు ధనిక, పేద, వర్గ విభేదాలు లేవని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. జిల్లాలోని కొవ్వూరులో 2 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని, అందువల్ల ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. కంటికి కనిపించని వైరస్‌తో మనం పోరాడుతున్నామని, కన్ను మూసి తెరిచే లోపు వైరస్‌ వ్యాపిస్తోందని, చివరకు అది శరీరంలో చేరినా వెంటనే బయట పడదని గుర్తు చేశారు. తాజాగా కొవ్వూరులో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనా ప్రజలు భయపడాల్సిన పని లేదని, అయితే ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. 

కరోనా వైరస్‌ నియంత్రణ, నివారణ కోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో పోరాడుతోందని, అయితే ప్రజల సహకారం ఎంతో అవసరమని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. ముఖ్యంగా యువత ఈ విషయంలో మరింత చొరవ చూపాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని, ఎక్కడైనా ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని, ఆస్పత్రిలో చేరాలని కోరారు. ఎట్టి పరిస్థితిలోనూ ఇంటి నుంచి బయటకు రావొద్దని, ఒకవేళ రావాల్సి వస్తే మాస్కు ధరించాలని, బహిరంగ ప్రదేశాలలో భౌతిక దూరం పాటించాలని, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని మంత్రి తానేటి వనిత ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
 
కృష్ణా జిల్లా:
జిల్లాలో కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న విజయవాడ నగరంలో కలెక్టర్‌ ఏఎండి ఇంతియాజ్, నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమల రావు పర్యటించారు. కరోనా వైరస్‌పై ప్రజలకు మరింత అవగాహన కల్పించే విధంగా కొంత మంది పోలీసులు, వాహనాలతో మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించారు. 

విజయవాడలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటించడం లేదని అధికారులు తెలిపారు. నగరంలో ముఖ్యంగా కృష్ణలంక, కార్మికనగర్, ఖుద్దూస్‌నగర్‌ ప్రాంతాలలో ఎక్కువ కేసులు నమోదయ్యాయని, ఆ ప్రాంతాల్లో యథేచ్ఛగా సామూహిక సమావేశాలు నిర్వహించడం వల్లనే వైరస్‌ వేగంగా వ్యాపించిందని పేర్కొన్నారు. ఒక్కో వ్యక్తి ద్వారా 20 మందికి వైరస్‌ సోకిందని, అందువల్ల ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలని, స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు.

జిల్లాలో 7,500 మందికి పరీక్షలు చేస్తే 170 మందికి పాజిటివ్‌ వచ్చిందన్న అధికారులు, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వృథాయే అని స్పష్టం చేశారు. విజయవాడలో ఇప్పటికే 150 కి పైగా పాజిటీవ్‌  కేసులు వచ్చాయని, అందువల్ల కరోనా వైరస్‌ను ఎవరూ తేలిగ్గా తీసుకోవద్దని నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు కోరారు.

నగరానికి విదేశాల నుంచి వచ్చిన వ్యక్తితో పాటు, మరో లారీ డ్రైవర్‌ ద్వారా కేసులు భారీగా పెరిగాయని సీపీ వెల్లడించారు. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన ఆ ఇద్దరిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశామన్న సీపీ, ప్రజలెవరూ ఇళ్లలోంచి బయటకు రావొద్దని, ఇష్టం వచ్చినట్లు తిరిగితే ఊర్కోబోమని హెచ్చరించారు. నగరంలోని అంతర్గత మార్గాలలో ప్రజల రవాణాపై డ్రోన్‌ కెమెరాలతో నిఘా పెడతామన్న పోలీస్‌ కమిషనర్‌ లాక్‌డౌన్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
 
ప్రకాశం జిల్లా:
రాష్ట్రంలో కరోనా లాక్‌ డౌన్‌ నేపథ్యంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ అన్ని చర్యలు తీసుకున్నారని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. ఆదివారం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని త్రిపురాంతకము మండలం, గొల్లపల్లిలో నిరుపేదలకు మంత్రి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందన్న మంత్రి, నిరుపేదలకు ఇప్పటికే రెండు పర్యాయాలు బియ్యం, పప్పులతో పాటు, రూ.1000 నగదు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్న మంత్రి ఆదిమూలపు సురేష్, రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడంతో పాటు, వాటి మార్కెటింగ్‌ కోసం రైతు భోరాసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పని కల్పిస్తామని తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలకు సగటు రోజు కూలీ రూ.232 గిట్టుబాటు అవుతుందన్న మంత్రి, కూలీలు పని చేసే సమయంలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని సూచించారు.
 
చిత్తూరు జిల్లా:
లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో జిల్లాకు వలస వచ్చి చిక్కుకుపోయిన వారికి జిల్లా యంత్రాంగం ఆపన్న హస్తం అందిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 26 రిలీఫ్‌ క్యాంపుల్లో 2,091 మంది వసతి పొందుతున్నారు. వాటిలో చిత్తూరులో–7, తిరుపతిలో–5, మదనపల్లెలో–2, వాల్మీకిపురంలో–1, యాదమరిలో–1, బంగారుపాళ్యంలో–1, శ్రీకాళహస్తిలో–1, చంద్రగిరిలో–1, రేణిగుంటలో–2, పలమనేరులో–1, కలికిరిలో–1, పుంగనూరులో–1, ఐరాలలో–1, కలకడలో–1 ఉన్నాయి.
ఆయా వసతి గృహాల్లో రాష్ట్రానికి చెందిన వారితో పాటు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఒడిషా, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మాహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, కేరళ, హరియాణ, సిక్కిం, గుజరాత్, నేపాల్, పంజాబ్‌కు చెందిన వలస కార్మికులున్నారు. వారికి ఆయా కేంద్రాలలో బస, భోజన సౌకర్యంతో పాటు, శానిటైజర్లు, మాస్కులు ఇచ్చారు. 

ఇంకా ఆహ్లాదకర పరిస్థితి, ఆరోగ్యం కోసం యోగా అభ్యాసం చేయిస్తున్నారు. ఉత్తరాది వంటకాలను అందిస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు పాలు, గుడ్లు, పండ్లు అందజేస్తున్నారు. 
 
అనంతపురం జిల్లా:
కరోనా వైరస్‌ మరింత విస్తరించకుండా హిందూపురంపై ప్రత్యేక దృష్టి పెట్టామని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు. ఆదివారం హిందూపురం పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో కోవిడ్‌–19 పై ఆయన నోడల్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ హిందూపురం ప్రాంతంలో కరోనా వైరస్‌ మరింత విస్తరించకుండా జిల్లా యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. హిందూపురంలో పాజిటివ్‌ కేసులకు సంబంధించి ఏ ఒక్క కాంటాక్ట్‌ మిస్‌ కాకుండా ట్రేస్‌ చేస్తున్నామని, ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లకు సంబంధించి అందరితో శాంపిల్స్‌ సేకరించి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఎంత మంది కాంటాక్ట్లను సేకరించారు, ఇంకా ఎంతమంది కాంటాక్ట్లను సేకరించాలి అనే వివరాలను అధికారులను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. 

హిందూపురంలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులతో ప్రైమరీ కాంటాక్ట్‌ వ్యక్తులు ఎలా, ఎందుకు కాంటాక్ట్‌ అయ్యారు అనే వివరాలను పక్కాగా ట్రేస్‌ చేయాలని, అప్పుడే పూర్తిస్థాయిలో కాంటాక్ట్‌ ట్రెసింగ్‌ చేసేందుకు వీలు కలుగుతుందన్నారు. కేరళ, సౌత్‌ కొరియాలో కరోనా వైరస్‌ అరికట్టేందుకు తీసుకున్న చర్యలను ఇక్కడ కూడా అమలు చేస్తామన్నారు. ఇప్పటివరకు పాజిటివ్‌ వచ్చిన వారికి సంబంధించి 70 శాతం మేర కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ పూర్తి చేశామని, పూర్తిస్థాయిలో కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌ వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు.

అలాగే క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్న వారికి రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాన్ని అందించాలని సంబంధిత నోడల్‌ అధికారులను ఆదేశించారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్న ముస్లింలకు రంజాన్‌ మాసం సందర్భంగా డ్రై ఫ్రూట్స్, పండ్లను అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో ఎంత మంది ఉన్నారు, ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు, ఇప్పటి వరకు ఎంత మందిని ఇంటికి పంపించారు.. అనే వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. స్థానిక తహశీల్దార్లతో పాటు కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ వివరాలు వేగంగా సేకరించేందుకు పుట్లూరు, యల్లనూరు, యాడికి, కదిరి, సింగనమల తహసీల్దార్లను కూడా అదనంగా నియమించాలని ఆదేశించారు. 

మరోవైపు రెడ్‌జోన్లలో పని చేసే వారి కోసం 6 వేల పీపీఈ కిట్లు, 4 వేల మాస్కులు, 3 వేల శానిటైజర్లు, 4 వేల గ్లౌజులను కలెక్టర్‌ గంధం చంద్రుడు హిందూపురం మున్సిపల్‌ కమిషనర్, తహసీల్దార్‌తో పాటు, పలువురు సీఐలను అందజేశారు.  
 
వైయస్సార్‌ కడప జిల్లా:
కడప ముస్లిం అసోసియేషన్‌ కువైట్‌ (కెఎంఎకె) సంస్థ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు నిత్యావసర సరుకుల పంపిణీ అభినందనీయమని ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌బి. అంజాద్‌ బాషా పేర్కొన్నారు. ఆదివారం ఆయన కెఎంఎకె అధ్యక్షుడు గఫార్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అల్మాస్‌ ఫంక్షన్‌ హాలులో నిరుపేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా అంజాద్‌ బాషా మాట్లాడుతూ కడప ముస్లిం అసోసియేషన్‌ కువైట్‌ సంస్థ గత ఏడేళ్లుగా కడపలో పేదలకు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని ప్రశంసించారు. పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమైన సమయంలో 200 పేద కుటుంబాలకు నెలకు సరిపోయే సరుకులు ఇవ్వడం జరిగిందని చెప్పారు. గతంలో ప్రతి ఏడాది 500 కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయగా, ఈసారి ఆ సంఖ్య తగ్గిందని, అందుకు కరోనా వైరస్‌ కారణమని చెప్పారు. దాదాపు 40 రోజుల నుంచి లాక్‌డౌన్‌ ఉండడం వల్ల ఉపాధి కోల్పోయిన పేదలకు ఎందరో దాతలు కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారని మంత్రి అంజాద్‌ బాషా పేర్కొన్నారు. 
 
కర్నూలు జిల్లా:
జిల్లాలో కరోనా కట్టడి కోసం తొలి నుంచి జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ అమలు చేస్తున్న కర్నూలు ఫైట్స్‌ కరోనా ప్రణాళికను ఇక నుంచి ‘ఆపరేషన్‌ కర్నూలు ఫైట్స్‌ కరోనా‘ పేరుతో పకడ్బందీగా అమలు చేయనున్నట్లు కోవిడ్‌ స్టేట్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ మరియు ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అజయ్‌జైన్‌ వెల్లడించారు. జిల్లాలో కరోనా నియంత్రణ చర్యలను ఆయన ఆదివారం సమీక్షించారు. కర్నూలు స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ మీటింగ్‌ హల్లో కలెక్టర్‌ జి.వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, ఇతర ఉన్నతాధికారులతో అజయ్‌జైన్‌ సమావేశమయ్యారు. 

కరోనా పాజిటివ్‌ కేసు వచ్చిన వెంటనే వారికి సంబంధించిన ప్రైమరీ, సెకండరీ కాంటాక్టస్‌ను వేగంగా ట్రేస్‌ చేయడం, క్వారంటైన్‌లో పెట్టడం,  టెస్టింగ్‌ చేయించడం, కర్నూలు మెడికల్‌ కాలేజ్‌ మైక్రో బయాలజీ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన ఆర్‌టి–పిసిఆర్‌ ల్యాబ్‌తో పాటు, హైదరాబాద్‌ అపోలో, విమ్టా, తిరుపతి స్విమ్స్‌ ల్యాబ్‌ల నుంచి వేగంగా రిజల్ట్స్‌ తెప్పించడం, వెంటనే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కోవిడ్‌ ఆస్పత్రులలో  ఐసోలేషన్‌ ట్రీట్మెంట్‌ చేయించడం,  ట్రాకింగ్‌ చేయడంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు