ఏపీలో 955కు చేరిన కరోనా కేసులు

శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (22:11 IST)
ఏపీ వ్యాప్తంగా గత 24 గంటల్లో 6306 శాంపిల్స్‌ పరీక్షించగా వాటిలో 62 కేసులు కరోనా పాజిటివ్‌గా తేలాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్‌–19 కేసుల సంఖ్య 955 కు చేరింది. 
 
కర్నూలు జిల్లాలలో అత్యధికంగా 261 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 206, కృష్ణా జిల్లాలో 102, చిత్తూరు జిల్లాలో 73, నెల్లూరు జిల్లాలో 68, ప్రకాశం జిల్లాలో 53, వైయస్సార్‌ కడప జిల్లాలో 51,  అనంతపురం జిల్లాలో 46, పశ్చిమ గోదావరి జిల్లాలో 39, తూర్పు గోదావరి జిల్లాలో 34, విశాఖపట్నం జిల్లాలో 22 కేసులు గుర్తించారు.

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఇప్పటి వరకు ఒక్క  కేసు కూడా నమోదు కాలేదు. కరోనా వైరస్‌కు చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి 145 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. వైయస్సార్‌ కడప జిల్లాలలో 28 మంది, కృష్ణా జిల్లాలో 25 మంది, గుంటూరు జిల్లాలో 23 మంది, విశాఖపట్నం జిల్లాలో 19 మంది, చిత్తూరు, అనంతపురం జిల్లాలలో 11మంది చొప్పున, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 8 మంది, నెల్లూరు జిల్లాలో 6గురు, కర్నూలు జిల్లాలో 4గురు, ప్రకాశం జిల్లాలో ఒకరు.. మొత్తం 145 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. 
 
ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ఆస్పత్రుల్లో 781 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఇప్పటి వరకు 29 మంది చనిపోయారు. గుంటూరు, కర్నూలు జల్లాలలో 8 మంది చొప్పున, కృష్ణా జిల్లాలో 7గురు, అనంతపురం జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు చనిపోయారు.  
 
జిల్లాలలో కోవిడ్‌–19 నివారణ చర్యలు:
 
శ్రీకాకుళం జిల్లా:
కరోనా వైరస్‌ నివారణ, నియంత్రణలో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి యం.బబిత అభివర్ణించారు. ముఖ్యంగా కరోనా నేపధ్యంలో లాక్‌ డౌన్‌ ప్రకటించిన సందర్భంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయంటే అది పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలే అని ఆమె కొనియాడారు. ఇటువంటి మహత్తర సేవలు అందిస్తున్న కార్మికులకు తమ వంతుగా ఏదైనా సహకారం అందించాలనే ఉద్దేశంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

శుక్రవారం జిల్లా కోర్టుల సముదాయంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటు చేసింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత, దాదాపు 100 మంది పారిశుద్ధ్య కార్మికులకు సరుకులు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రత ముఖ్యమని అన్నారు.

జిల్లాలోని ఆసుపత్రులు, కార్యాలయాలు, రహదారులు ఇలా అన్నిరకాల పరిసరాలను రేయింబవళ్లు పరిశుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు సేవలు అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో ప్రభుత్వం పిలుపునిచ్చిన మేరకు సామాజిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులను వాడుతూ ఇటువంటి సేవలు అందిస్తున్న ప్రతీ కార్మికునికి హ్యాట్సాఫ్‌ అన్నారు.

ఇంతటి మహోన్నత సేవలు అందిస్తున్న కార్మికులకు చిరుకానుకను ఇచ్చి సత్కరించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిర్ణయించిందని, అందులో భాగంగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఇందుకు సహచర న్యాయమూర్తులు తోడ్పాటునిచ్చారని, ఇదే స్పూర్తితో భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వివరించారు.
 
విజయనగరం జిల్లా:
జిల్లాలో కరోనా నిర్ధారణ పరీక్షలు మరింత వేగవంతంగా మరింత అధికంగా జరిగేందుకు రంగం సిద్దమయ్యింది. జిల్లా స్థాయిలోనే కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు వీలుగా రాష్ట్ర పభుత్వం పంపిన 1680 రాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లు శుక్రవారం జిల్లాకు చేరాయి. ఈ కిట్‌ల ద్వారా కేవలం పది నిముషాల వ్యవధిలో నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అవకాశం ఉంటుంది.

జిల్లాకు వచ్చిన టెస్టింగ్‌ కిట్లతో జిల్లా పరిషత్‌ అథితి గృహంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణికి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్‌.వి.రమణకుమారి నేతృత్వంలో వైద్య సిబ్బంది నిర్ధారణ పరీక్షలు జరిపారు. ఈ పరీక్షలో ఉప ముఖ్యమంత్రికి నెగటివ్‌ రిజల్ట్‌ వచ్చిందని డాక్టర్‌ రమణకుమారి తెలిపారు. కొత్తగా వచ్చిన కిట్లతో వ్యాధిగ్రస్తుల ఇళ్ళ వద్దకు వెళ్లి నిర్ధారణ పరీక్షలు చేస్తామని ఆమె చెప్పారు.

ఈ టెస్ట్‌ కిట్ల ద్వారా వ్యాధి నిర్థారణతో పాటు, అది ఎప్పుడు సోకిందన్న విషయం కూడా తెలుస్తుందని తెలిపారు. పరీక్షల నిర్వహణలో వైద్యులు, సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇచ్చామని డిఎంహెచ్‌ఓ వివరించారు.

మరోవైపు కరోనా నుంచి రక్షణ కల్పించే చర్యల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు మాస్క్‌ లు, శానిటైజర్లను ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పంపిణీ చేశారు. కలెక్టర్‌ కార్యాలయంలో జీరో వడ్డీ పథకం కింద చెక్కుల పంపిణీ కోసం వచ్చిన ఉప ముఖ్యమంత్రి, జిల్లా యంత్రాంగం జర్నలిస్టుల కోసం అందజేస్తున్న ఈ రక్షణ పరికరాలు అందించారు.

ఒక్కో జర్నలిస్ట్‌కు 250 మీ.లీ. శానిటైజర్‌ బాటిల్, రెండు మాస్క్‌ లు చొప్పున అందజేశారు. క్షేత్రస్థాయిలో ప్రతిరోజూ అనేక ప్రాంతాల్లో పర్యటించే జర్నలిస్టులకు కరోనా నుండి రక్షణ కల్పించడం  అవసరమని భావించి వీటిని అందజేస్తున్నామని కలెక్టర్‌ డా.ఎం.హరిజవహర్‌లాల్‌ చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్ళే ప్రతి ఒక్కరు కరోనా నుండి రక్షణకు మాస్క్‌ లు ధరించాలని ఆయన కోరారు. 
 
కృష్ణా జిల్లా:
కోవిడ్‌–19 నివారణ చర్యల్లో భాగంగా విజయవాడలోని కృష్ణలంక, కార్మికనగర్‌ ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించారు. నగరంలో ఇప్పటికే ఆరు రెడ్‌జోన్లు ఉన్నాయి. విద్యాధరపురంలోని కమ్మరిపాలెం, ఓల్డ్‌ ఆర్‌ఆర్‌ పేట, రాణిగారితోట, ఖుదూష్‌నగర్, పాయకాపురం, కానూరు గ్రామ పంచాయితీలోని సనత్‌నగర్‌ను రెడ్‌జోన్లుగా ప్రకటించగా, కొత్తగా ఆ జాబితాలో కృష్ణలంక, కార్మికనగర్‌ చేర్చారు. రెడ్‌జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ పూర్తిగా అమలువుతుందని, ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కలెక్టర్‌ ఏఎండి ఇంతియాజ్‌ వెల్లడించారు.

ప్రజలకు అవసరమైన నిత్యావసరాల సరఫరాకు తగిన చర్యలు తీసుకోవాలని నగర పాలక కమిషనర్‌ను ఆదేశించామని తెలిపారు. రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో అత్యవసర విధులు నిర్వహించే అధికారుల వాహనాలు, నిత్యావసరాలు సరఫరా చేసే వాహనాలు, పోలీసు వాహనాలతో పాటు, ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులను మాత్రమే అనుమతి ఇస్తామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు.

మరోవైపు లాక్‌ డౌన్‌ అమలవుతున్న వేళ పేద ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా వారికి నిత్యావసరాల కిట్లను ప్రోగ్రెస్సివ్‌  రికగ్నైజేడ్‌  టీచర్స్‌ అసోసియేషన్‌ రురల్‌ టీచర్స్‌ యూనియన్‌ తరుపున అందచేయడం ఎంతో అభినందనీయమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మచిలీపట్నంలోని నోబుల్‌ కాలనీ లో 16 రకాల నిత్యావసరాలను 150 మందికి అందచేశారు.

అనంతరం పిఆర్‌టియు రూరల్‌ టీచర్‌ యూనియన్‌ ప్రతినిధులు 11, 12 వార్డుల వాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. అదేవిధంగా 19వ డివిజన్లో కొన్ని కుటుంబాలకు నిత్యవసర వస్తువులు మంత్రి పంపిణీ చేశారు. ఆ తర్వాత గొడుగుపేట వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో పేద బ్రాహ్మణులు 70 మందికి కూడా మంత్రి నాని నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇంకా 75 మంది నిరుపేద పురోహితులకు 18 రకాల సరుకులు అందజేశారు.
 
గుంటూరు జిల్లా:
జిల్లాలోని కోవిడ్‌–19 పునరావాస కేంద్రాలలో ఉంటున్న వారికి మంచి భోజనంతో పాటు, అన్ని సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఆదేశించారు. కొత్తపేటలోని పచ్చిపులుసు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని జిల్లా కోవిడ్‌–19 ప్రత్యేక అధికారి రాజశేఖర్‌తో కలిసి కలెక్టర్‌ సందర్శించారు. ఆ పునరావాస కేంద్రంలో ఉంటున్న వారితో మాట్లాడి, అక్కడ వారు పొందుతున్న సదుపాయాలను ఆరా తీశారు.

పునరావాస కేంద్రాలలో ఉంటున్న వారికి దుప్పట్లు, టవళ్లు అందజేయాలని, నిరంతరం శానిటైజేషన్‌ చేస్తుండాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా అక్కడ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ, కచ్చితంగా భౌతిక దూరం పాటించేలా చూడాలని నిర్దేశించారు. జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 21 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా, వాటిలో 973 మంది ఉంటున్నారని, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటైన 11 కేంద్రాలలో 274 మంది వసతి పొందుతున్నారని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ వెల్లడించారు. 
 
ఇంకా రోజువారీ కూలీలు, వలస కార్మికులు 13,500 మందికి స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో రోజూ భోజన వసతి కల్పిస్తున్నామని, 11963 మంది కార్మికులకు ఆయా పరిశ్రమల యాజమాన్యాల సహకారంతో భోజనాలు అందించే విధంగా చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ చెప్పారు. 
 
చిత్తూరు జిల్లా:
కరోనా నివారణ చర్యల ముందస్తు జాగ్రత్తలలో భాగంగా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు మాత్రమే ఇవ్వాలని, అది కూడా డాక్టర్‌ గారి సమక్షంలోనే వినియోగించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పెంచలయ్య పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన, కరోనా టెస్టింగ్‌లో భాగంగా పిహెచ్‌సి లకు ఆర్డిటి (ర్యాపిడ్‌ డయాగ్నోస్టిక్‌ టెస్ట్‌) కిట్స్, పిపిఇ కిట్స్, ఎన్‌–95 మాస్క్‌ లు, హైడ్రో క్లోరోక్విన్‌ మాత్రల సరఫరాను సమీక్షించారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ పెంచలయ్య మాట్లాడుతూ, ఆర్డిటి కిట్స్‌ను విలేజ్‌ వాలంటీర్‌ సర్వే డేటాలో పొందుపర్చిన పేర్లకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే కరోనా టెస్ట్‌ చేయాలని సూచించారు. అదే విధంగా పీపీఈ కిట్, ఎన్‌–95 మాస్కులను కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలకు అనుగుణంగానే వాడాలని పేర్కొన్నారు.
 
అనంతపురం జిల్లా:
కోవిడ్‌–19 నేపథ్యంలో ప్రభుత్వం తరపున డాక్టర్ల రక్షణకు తొలి ప్రాధాన్యం ఇస్తామని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ లో కోవిడ్‌ 19 నేపథ్యంలో పుట్టపర్తి శ్రీ సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ తరపున 4 వేల పిపిఈ కిట్లను జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిపై   దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం 1897 ఎపిడమిక్‌ డిసీజెస్‌ యాక్ట్‌లో మార్పులు తెస్తూ ఆర్డినెన్సు తీసుకువచ్చిందని, ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడినా, ప్రోత్సహించినా లేదా వాహనాలు, ఆస్పత్రులకు నష్టం కలిగించినా కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
కరోనా వైరస్‌ నేపథ్యంలో పుట్టపర్తి శ్రీ సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ ఎంతో ఔదార్యం చూపించి పిపిఈ కిట్లు ఇవ్వడం గొప్ప విషయమని కలెక్టర్‌ గంధం చంద్రుడు అభినందించారు.

జిల్లాలో కోవిడ్‌–19పై పోరాటం చేయడానికి సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్, ఆర్డీటీ లాంటి సంస్థలు సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు రావడం జరిగిందన్నారు. జిల్లాలోని సీడీఎస్, డిఎంహెచ్‌ఓ, డిహెచ్, జిజిహెచ్, కిమ్స్‌ సవేరాలో ఇప్పటివరకు 28,845 పిపిఈ కిట్లు, 8045 ఎన్‌–95 మాస్కులు, 1,21,538 సర్జికల్‌ మాస్కులు, 2,42,910 గ్లౌజులు సిద్ధంగా ఉన్నాయన్నాని కలెక్టర్‌ వివరించారు.
 
వైయస్సార్‌ కడప జిల్లా:
విపత్కర పరిస్థితుల్లో పేదలకు సాయం చేయడంలో ఎంతో సంతృప్తి ఉంటుందని ఉప ముఖ్యమంత్రి ఎస్‌బి.అంజాద్‌ బాషా పేర్కొన్నారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ మేయర్‌ సురేష్‌బాబుతో కలిసి ఆయన శుక్రవారం 31వ డివిజన్‌ బ్రాహ్మణ వీధిలో పేదలకు బియ్యం, కందిపప్పు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, లాక్‌ డౌన్‌ వల్ల చాలా మంది పేదలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ తరుణంలో దాతలు ముందుకు వచ్చి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ఎంతో శుభపరిణామమన్నారు.

కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు. కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని, ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని మంత్రి అంజాద్‌ బాషా కోరారు.
250 మందికి  బియ్యం, కంది పప్పు పంపిణీ: 31వ డివిజన్‌ బ్రాహ్మణ వీధిలో జిల్లా అర్చక పురోహిత అధ్యక్షులు విజయస్వామి, మరియు వశిష్ట విద్యా మందిర్‌ కరస్పాండెంట్‌ రమణారెడ్డి, ఎన్‌ఆర్‌ఐ ఆనంద్‌ వారి సహకారంతో బ్రాహ్మణ వీధిలో 50 మంది అర్చక స్వాములు, మరియు 200 మందికి ఒక్కొక్కరికి పది కేజీల బియ్యం, కేజీ కంది పప్పు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందన్నారు. లాక్‌ డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం ప్రతి ఒక్కరు గర్వించ దగ్గ విషయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైద్య పరీక్షలు ప్రతి ఒక్కరికి నిర్వహించి కరోనా వైరస్‌ నివారణకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు వేగవంతం చేయడం జరుగుతుందన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు