కరోనా వైరస్ ఎఫెక్ట్... ఏపీలో పెరిగిన డేటా వినియోగం!
శనివారం, 31 అక్టోబరు 2020 (15:50 IST)
కరోనా లాక్‌డౌన్ తరువాత ఏపీలో ఇంటర్నెట్ డేటా వాడకం జోరందుకుంది. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు టెలికం కంపెనీలు, బ్రాడ్ బ్యాండ్, ఫైబర్‌నెట్ ప్రొవైడర్లు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి.
గతంలో వారంలోని అన్ని రోజులూ.. వారాంతాలకు డేటా వినియోగంలో చాలా తేడా ఉండేది. ప్రస్తుతం వారంలోని అన్ని రోజులూ ఒకే తరహా డేటా వినియోగం కనిపిస్తోంది. అది అంతకంతకూ పెరుగుతోందని సంస్థలు ధ్రువీకరిస్తున్నాయి.
జియో డేటా వినియోగం ప్రస్తుతం సగటున రోజుకు 6,000 టీబీ. లాక్‌డౌన్ తర్వాత దాదాపు ఇది 20 నుంచి 25 శాతం పెరిగినట్లు అంచనా. ఎపి లోని విజయవాడ, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల్లో మెరుగైన స్పీడ్‌ను అందించేందుకు 'ఎయిర్‌టెల్' ఫైబర్‌నెట్ సర్వీసులను ప్రారంభించింది.
గతంలో కంటే ఎక్కువ ఇంటర్నెట్ స్పీడ్‌ను జనం కోరుకుంటున్నారు. అందుకే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లకూ గిరాకీ పెరిగింది. బిఎస్‌ఎన్‌ఎల్ ఫైబర్‌నెట్ (ఎఫ్‌టిటిహెచ్) కనెక్షన్లు ఏడు నెలల్లో 15,000 (75 శాతం) పెరగడం డేటా వాడకంలో వినియోగదారుల దూకుడును స్పష్టం చేస్తోంది.
బ్రాడ్ బ్యాండ్ సేవలందించే ఓ ఫైబర్‌నెట్ సంస్థ కరోనా తర్వాత రాష్ట్రంలో 40 వేలకు పైగా కనెక్షన్లను పెంచుకుంది. బిఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ డేటా వినియోగంలో 25 శాతం పెరిగింది.
లాక్‌డౌన్ తర్వాత...
కరోనా లాక్‌డౌన్ తర్వాత చాలామంది ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. గతంలో వర్క్ ఫ్రం హోం సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లాంటి వాటికే పరిమితం. ఇప్పుడు అది చాలా రంగాలకు విస్తరించింది. గతంలో ఇతర రాష్ట్రాల్లోని పెద్ద నగరాల్లో ఉద్యోగాలు చేసినవారు.. ఇప్పుడు అదే పనిని ఎపి లోని స్వస్థలాల్లో ఉండి ఇంటి నుండే చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు దాదాపు 35 లక్షల మంది. వీరిలో ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యేవారి సంఖ్య 20 లక్షలకు పైమాటే. రోజంతా ఇంట్లోనే ఉంటున్న పిల్లలు యూట్యూబ్‌లలోనూ, ఒటిటిల్లోనూ కిడ్స్ వీడియోలు చూస్తూ, ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తుండటం కూడా డేటా వినియోగాన్ని పెంచుతోంది. ఇటీవల ఒటిటి వేదికలకు బాగా ఆదరణ పెరిగింది.
కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, వివిధ భాషల్లోని సినిమాలు.. సబ్ టైటిల్స్‌తో అందుబాటులో ఉంటుండటంతో సరికొత్త వినోద ప్రపంచంలో ప్రజలు ఆనందిస్తున్నారు. చాలామంది డిటిహెచ్, కేబుల్ వంటివి లేకుండా వినోద కార్యక్రమాలు డేటాతోనే వీక్షిస్తున్నారు.
నెలకు 500 జిబి నుండి 1000 జిబి వరకు డేటాను కేవలం గృహావసరాలకే వినియోగించేవారు సైతం ఉన్నారు. ఇందుకు అనుగుణంగానే పలు సంస్థలు సరసమైన ధరలకే ప్లాన్లను అందుబాటులో ఉంచాయి.