డబ్బు ఆర్జన అనేది కష్టంతో కాకుండా అడ్డదారుల్లో సంపాదించడం అనే కాన్సెప్టుకు వెళ్లినపుడు అది నేరమయంగా మారుతుంది. ఇందుకు ఉదాహరణే ఈ ఘటన. కదిరి వెంకటేష్ అనే వ్యక్తి బావమరిది కుప్పిలి నాగేంద్ర అతడి బావనే పెట్టుబడిగా ఎంచుకున్నాడు. అతడి పేరున కోటి 19 లక్షలు బీమా చేయించాడు. తనపై ఎంతో ప్రేమతో బావమరిది కోటి రూపాయల బీమా చేయించాడని అతడు మురిసిపోయాడు.
కానీ గత ఏడాది ఆగస్టు నెలలో బావను తీసుకుని రైలు ప్రయాణం చేస్తూ మార్గమధ్యంలో రైలు నుంచి కిందికి తోసి హత్య చేశాడు. ఐతే అది ప్రమాదమని అందరినీ నమ్మించాడు. పొరబాటున ఆయన రైలు నుంచి జారిపడి చనిపోయాడని చెప్పాడు. కానీ పోలీసులు తమదైన శైలిలో కేసు దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది. డబ్బు కోసమే బావను రైలు నుంచి తోసి చంపేసినట్లు తేలింది. అతడు చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ క్లయిమ్ చేసుకుని రూ. 69 లక్షలు డ్రా చేసుకున్నాడు. ఈ కేసులో నిందితులయిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.