వైకాపాకు షాకిచ్చిన మాజీ ఎమ్మెల్యే - మళ్లీ టీడీపీ గూటికి?

మంగళవారం, 2 జనవరి 2024 (18:46 IST)
మరో మూడు నెలల్లో ఎన్నికలు ఎదుర్కోనున్న వైకాపాకు ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరు తేరుకోలేని షాకులు ఇస్తారు. ఇప్పటికే పలువురు నేతలు వైకాపాకు రాజీనామాలు చేశారు. తాజాగా మరో సీనియర్ నేత దాడి వీరభద్రరావు పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలకు ఆయన ఏకవాక్యంలో రాజీనామా లేఖలను పంపించారు. తన అనుచరులతో కలిసి పార్టీని వీడుతున్నానని ఏక వాక్యంతో రాజీనామా లేఖ రాశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన రాజకీయ భవిష్యత్‌పై త్వరలోనే ప్రకటన చేస్తానని తెలిపారు. ఏ పార్టీలో చేరేది అపుడు చెబుతానని పేర్కొన్నారు. 
 
కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక నేతగా వ్యవహరించిన దాడి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీ తరపున నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పని చేశారు. అయితే, 2014 ఎన్నికలకు ముందు వైకాపాలో చేరారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు మళ్లీ వైకాపాలో చేరారు. ఇపుడు మరోమారు వైకాపాకు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. విశాఖకు చెందిన దాడి వీరభద్రరావు... ఒకపుడు టీడీపీలో కీలక నేతగా వ్యవహరించి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ప్రధాన అనుచరుడుగా ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు