దేశ సామాజిక వ్యవస్థకు అనుగుణంగా దీనదయాళ్ ఏకాత్మత మానవతావాదం: పవన్

శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (22:08 IST)
చిట్టచివరి మనిషి వరకు అభివృద్ధిని చేర్చడం.. ఆ క్రమంలో భగవంతుని చేరడం అనేది పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారు ప్రతిపాదించిన ఏకాత్మత మానవతావాదం (ఇంటెగ్రల్ హ్యూమనిజం) సిద్ధాంతం ముఖ్య ఉద్దేశమని జనసేన పార్టీ  అధ్యక్షులు పవన్ కల్యాణ్ అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆత్మ నిర్భర్ భారత్ కి కూడా ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలే మూలం అన్నారు. జనసేన పార్టీ మీద కూడా పండిట్ దీనదయాళ్ ఉపాద్యాయ గారి ఆలోచనా విధానం కొంతమేరకు ప్రభావం చూపింది అని తెలిపారు.  పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా శుక్రవారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... "భారత దేశాన్ని సమష్టిగా అభివృద్ధిపరిచే లక్ష్యంతో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మత మానవతావాదం పేరిట ఓ సామాజిక ఆర్థిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. 1965లో విజయవాడలో జరగిన భారతీయ జనసంఘ్  జాతీయ సదస్సులో దీన్ని ఆమోదించారు. ఇదే జనసంఘ్ ఆవిర్భావ సిద్ధాంతం. 1985లో దీన్నే భారతీయ జనతా పార్టీ కూడా తన మూల సిద్ధాంతంగా ఆమోదించింది.

బ్రిటీష్ పాలన నుంచి బయటికి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక ఇజాలు పుట్టుకొచ్చాయి. అలాంటి పలు ఆలోచనలు, సిద్ధాంతాల నడుమ పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మత మానవతావాదాన్ని ప్రతిపాదించారు. ధర్మార్ధ కామ మోక్షాలు దీనికి ప్రాతిపదికగా కనిపిస్తుంది. కేవలం ధర్మం అనేది దేవాలయాలకే పరిమితం కాకుండా ప్రతి దానికీ తీసుకురావాలి అని చెప్పారు. సామాజిక జీవితంలోకి, రాజకీయ ప్రస్థానంలోకి తీసుకురావాలి.

చివరికి మనిషి తన అభివృద్ధిలో క్రమంలో భగవంతుని చేరడం అనేది ఈ ఏకాత్మత మానవతావాదం అంతిమ లక్ష్యం.  పశ్చిమ దేశాల్లో పుట్టిన క్యాపిటలిజం, సోషలిజం మన దేశానికి ఎంత వరకు సరి పడతాయి అనే అంశం మీద చర్చ జరిగినప్పుడు-  ఉత్పత్తి కులాలు ఉన్న మన వ్యవస్థకు అవి ఎంత వరకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తాయన్న ఆలోచనల నుంచి ఆయన దీన్ని ప్రతిపాదించారు.ప్రతి దేశానికి ఓ ప్రత్యేక జీవన సంస్కృతి ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి.

అక్కడ అమలు చేసిన సిద్ధాంతాలను ఇక్కడ అమలు చేయడం కుదరదు. వాటిని మన పరిస్థితులకు అనుగుణంగా సరి చేసుకుని తీసుకోవాలి. అట్టడుగున ఉన్న వారికి అభివృద్ధి చేరే వరకు మనం పని చేయాలి అనే దీనదయాళ్ ఉపాధ్యాయ గారి ఆలోచన. ఆ అభివృద్ధి కేవలం సామాజిక, ఆర్థికపరమైన అంశాలతో సరిపెట్టకుండా భగవంతుడి వైపు దృష్టి సారించడమే ఆయన చెప్పిన సిద్ధాంతం లక్ష్యం.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్ కి పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారు ప్రతిపాదించిన ఆర్ధిక సూత్రాలే మూలం. మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి అందుకు సంబంధించిన ఒక ఉదాహరణ. మోడీ ఆత్మ నిర్భర్ భారత్ కి సంబంధించి చేసిన రేడియో ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ తాలూకు ఏటికొప్పాక బొమ్మల గురించి మాట్లాడడం, మన సంస్కృతిలో భాగమైన వారికి ఎలాంటి చేయూత ఇవ్వాలి, ఎలాంటి మార్కెటింగ్ కల్పించాలి అనే అంశాలు ప్రస్తావించారు.

ఎంతో క్లిష్టమైన భారతీయ సామాజిక వ్యవస్థను క్షుణ్ణంగా అర్థం చేసుకుని దీన దయాళ్ ఉపాధ్యాయ గారు ఇంటిగ్రల్ హ్యూమనిజం ప్రతిపాదించారు. మోడీ దాన్ని ఆత్మనిర్భర్ భారత్ ద్వారా ముందుకు తీసుకువెళ్తున్నారు. భవిష్యత్తులో సామాజికంగా అట్టడుగున ఉన్న వ్యక్తికి కూడా అభివృద్ధి అందాలి.. తద్వారా సృష్టికర్త అయిన భగవంతుని వైపు  చేరుకోవాలి. కుల మతాలకు అతీతంగా ప్రతి మనిషి అభివృద్ధి అనే అంశాలతో ప్రతిపాదించిన సిద్ధాంతం ఇది.

జనసేన రాజకీయ సిద్ధాంతం గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారి ఏకాత్మత మానవతావాదం చదివి దాన్ని అర్ధం చేసుకున్నాను. నా వరకు ఆయన తాలూకు ఆలోచనా విధానం జనసేన మీద ఎంతో కొంత పడిందనే చెప్పాలి. అందుకే మనస్ఫూర్తిగా పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారికి రుణపడి ఉంటాం" అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు