విజయవాడ: ఏపీలో రాజకీయం మళ్ళీ అయోమయంగా మారుతోంది. తెలుగుదేశం పార్టీ ఇంతకాలం ఆకర్ష్ ద్వారా వైసీపీ ఎమ్మెల్యేలను లాక్కుంది. ఇపుడు ఆ ఆపరేషన్ ఆకర్ష్‌ని కృష్ణా పుష్కరాల తర్వాత మళ్ళీ బయటకు తీసింది. ఈసారి వైసీపీ ఒక్కటే టార్గెట్ కాకుండా, అటు కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకునే ప్రయత్నంలో ఉంది. దీనిలో భాగంగానే మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూని టీడీపీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు అంతర్గత చర్చలు అయిపోయాయి.
దేవినేని నెహ్రూ సోదరుడు, టీడీపీ ప్రభుత్వంలో కీలక మంత్రి దేవినేని ఉమ లాబీయింగ్ చేశారు. దీనితో దేవినేని నెహ్రూ నిన్న తన కార్యకర్తలతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఇందులో అందరూ ముక్తకంఠంతో నెహ్రూకి తమ పూర్తి మద్దతు తెలిపారు. మీరు ఎలా అంటే, అలా... మీరు ఎటు వెళితే అటే... అంటూ కార్యకర్తలు భరోసా ఇచ్చారు. కానీ, నెహ్రూ ఎందుకో వెనకడుగు వేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
మొన్నటివరకు టీడీపీలోకి చేరేందకు ఉర్రూతలూగిన నెహ్రూ ఒక్కసారిగా కొంచెం బ్రేక్ వేయడానికి కారణం...నిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ రీఎంట్రీనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. పవన్ జనసేన ఎంట్రీ ఇస్తే, ఏపీలో రాజకీయ సమీకరణాలు మారతాయని, దీనిని కూడా గమనించుకుని నిర్ణయం తీసుకోవాలని నెహ్రూ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ హయాంలో రాజకీయాల్లోకి వచ్చిన నెహ్రూ ఇపుడు లోకేష్ లాంటి యువతరంతో కలిసి పనిచేయాలంటే... కాస్త ఇబ్బందే. కానీ, అన్నీ ఆలోచించుకుని ముందడుగు వేయకపోతే... మునిగిపోతాం అని మాత్రం సందేహిస్తున్నారు. మరోవైపు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో క్రియాశీలకం అయితే అటు వెళితే ఎలా ఉంటుందన్న యోచనలో కూడా ఉన్నట్లు సమాచారం.