భానుడి దెబ్బకు నాలుగేళ్ళలో 4 వేల మంది మృతి : సుజనా చౌదరి

గురువారం, 28 ఏప్రియల్ 2016 (08:33 IST)
గత నాలుగు సంవత్సరాలుగా ఎండ వేడికి తట్టుకోలేక దేశ వ్యాప్తంగా నాలుగు వేల మంది మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్‌సభలో విపక్ష సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సాంకేతిక, భూవిజ్ఞాన సహాయ మంత్రి సుజనా చౌదరి పై విధంగా సమాధానమిచ్చారు. నాలుగేళ్లలో 4204 మంది చనిపోయారని, వీరిలో 2013లో 1433 మంది చనిపోగా అందులో 1393 మంది ఆంధ్రప్రదేశ్‌ నుంచే ఉన్నారు. 
 
అలాగే, 2015లో ఆంధ్రప్రదేశ్‌లో 1422 మంది మృత్యువాత పడగా, 584 మంది తెలంగాణలో చనిపోయినట్టు మంత్రి వివరించారు. ఈ యేడాది మార్చి నాటికి ఎండ వేడిమి కారణంగా 87 మంది మృతి చెందారన్నారు. అందులో తెలంగాణలో 56, ఒడిశాలో 19, ఆంధ్రప్రదేశ్‌ 8, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఒక్కొక్కరు చొప్పున ఉన్నట్టు ఆయన వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి