కొడాలి ఫంక్షన్ హాల్లోనే క్యాషినో జ‌రిగింద‌ని నిరూపిస్తాం...

శనివారం, 22 జనవరి 2022 (15:16 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మంత్రి కొడాలి నాని కాసినో వ్య‌వ‌హారం వేడెక్కింది. మంత్రి క‌ల్యాణ మండ‌పంలోనే క్యాసినో జ‌రిగింద‌ని టీడీపీ నాయ‌కులు బ‌ల్లగుద్ది మరీ చెపుతున్నారు. విజ‌య‌వాడ‌లోని మొగల్రాజపురంలోని బోండా ఉమా ఇంటివద్ద గల టీడీపీ కార్యాలయంలో  ఆయ‌న మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. 
 
 
ఈ సందర్బంగా బోండా ఉమా మాట్లాడుతూ, గుడివాడలో కాసినో జరిగిందని నిరూపించమని సవాల్ చేసిన కొడాలి నాని సవాలును స్వీకరిస్తున్నాం అన్నారు. గుడివాడలో కొడాలి నాని సొంత ఫంక్షన్ హాల్  కె.కన్వెన్షన్ లో కెసినో నిర్వహించారని సాక్షాలతో సహా నిరూపించడానికి మేం సిద్ధంగా ఉన్నాం అన్నారు.  నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటా అని, రాజీనామా చేస్తాం అన్న కొడాలి నాని మాట నిలబెట్టుకోవాలని డిమాండు చేశారు. వీడియోలతో సహా కేసినో నిర్వహించారని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం అని అన్నారు.
 
 
 కొడాలి నానికి డబ్బు పిచ్చి పట్టింది అని, అందుకే ఇలాంటి అశ్లీల వ్యవహారాలతో యువతను తప్పు దారి పట్టిస్తున్నారని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్ముతూ రాష్ట్రాన్ని నాశనం చేసారని, ఇప్పుడు జూదం ఆడిస్తూ రాష్ట్ర పరువును బజారుకీడుస్తున్నారు అన్నారు.  కెసినో జరిగిన ప్రదేశాన్ని విచారించడానికి నిన్న టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ గుడివాడ వస్తే ఎక్కడ నిజాలు బయిటికి వస్తాయో అని కోడలి నానికి భయం పుట్టుకొచ్చి తన అనుచరులను, వైసీపీ నాయకులను అడ్డం పెట్టి మమ్మల్ని వెళ్లనివ్వకుండా చేసాడన్నారు. 
 
 
కొడాలి నాని ముఖ్య అనుచరులతో నా కారుపై దాడి చేయించారని బోండా ఉమ మండిపడ్డారు. దీనిపై కలెక్టర్ ను కలిసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయబోతున్నాం అని, స్పందించకపోతే హై కోర్టుకు వెళ్లి పోరాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అని చెప్పారు. వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా గుడివాడ కెసినో పై నిజాలు నిగ్గుతేలుస్తాం అని, యువత భవిష్యత్తు నాశనం చేస్తున్న  కొడాలి నానిని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చేశారు. 
 
 
ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, నేతలు నందేటి భాను సింగ్, దివి ఉమామహేశ్వరరావు, పిరియా జగదాంబ, చింతల మధుబాబు, గొట్టుముక్కల వెంకీ, లబ్బ వైకుంఠం, సోమేశ్వరరావు, తియ్యాల అప్పారావు, బెజ్జం జైపాల్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు