రాజధానిలో వైసీపీకి గుబులు... అందుకే ఎన్నికలకు వెనుకడుగు
మంగళవారం, 14 జనవరి 2020 (18:49 IST)
రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమాల నేపథ్యంలో అధికార పార్టీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. దీంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో ఎన్నికలు జరిగితే వైసీపీ తరఫున నామినేషన్ వేసే వారే లేరంటే ఆశ్చర్యం లేదు.
ఆ ప్రాంతాన్ని అమరావతి నగరపాలక సంస్థ పేరుతో ఏర్పాటు చేస్తున్నామని.. రాజధానిని తరలించడం లేదని, అమరావతి కొనసాగుతుందనే భావన రావడం కోసం ప్రభుత్వం ఈ వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం ఈ ప్రాంతమంతా సీఆర్డీయే పరిధిలో ఉంది.
సీఆర్డీయే నుంచి రాజధానిలోని మూడు మండలాలకు చెందిన 31 గ్రామాలను విడగొట్టి ప్రత్యేకంగా నగరపాలక సంస్థగా నోటిఫై చేయాలి. దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలి. అభిప్రాయ సేకరణ, ఇతర అంశాలపై ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే వెంటనే ఎన్నికలు జరిగే అవకాశం లేదు. అమరావతిని విస్మరించలేదనే చర్చను కొనసాగించడానికి వైసీపీ ప్రభుత్వం దీనిని తెరపైకి తెచ్చింది.
గత ప్రభుత్వం ఆ ప్రాంతంలో నిర్మించిన భవనాలలో ఒక దానిని నగరపాలక సంస్థ కార్యాలయంగా మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద అమరావతి నగరపాలక సంస్థ పేరుతో ప్రుస్తుతం రాజధాని పరిధిలో ఉన్న గ్రామాలతో నగర ప్రాంతం రాబోతుంది. గుంటూరు జిల్లాలో సుమారు 75 ఎంపీటీసీలు, వాటి పరిధిలోని గ్రామ పంచాయతీలు రద్దు కాబోతున్నాయి. సుమారు 2 లక్షల మంది గ్రామీణ ఓటర్లు పట్టణ ఓటర్లుగా రూపాంతరం చెందబోతున్నారు.
ఇప్పటివరకు ఉన్న గ్రామ పంచాయతీలు ఇక నుంచి ఆయా మున్సిపల్, నగరపాలక సంస్థల్లో వార్డులుగా కొనసాగబోతున్నాయి. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేది ఈ మేరకు ఉత్తర్వులు పంపారు.
ఈ మండలాల పరిధిలో ఎంపీటీసీ, సర్పంచ్‌లు, జడ్పీటీసీల ఎన్నికలు ఉండబోవని స్పష్టం చేశారు. వీటితో పాటు ప్రస్తుతం రాజధాని ప్రాంతంగా ఉన్న అమరావతిని ప్రత్యేక నగరపాలక సంస్థగా తీసుకురాబోతున్నారు.
అమరావతి నగరపాలక సంస్థ:
తుళ్లూరు మండలంలోని 18 రెవెన్యూ గ్రామాలు, 16 గ్రామ పంచాయతీలు, వీటి పరిధిలోని 20 గ్రామాలు, తాడేపల్లి మండలంలోని రెండు రెవెన్యు, పంచాయతీ గ్రామాలు, మంగళగిరి మండలంలోని ఏడు గ్రామ పంచాయతీలు, 4 రెవెన్యూ గ్రామాల పరిధిలోని 9 గ్రామాలను కలిపి అమరావతి రాఽజధాని నగరం పేరుతో మున్సిపల్ కార్పొరేషన్‌గా ప్రతిపాదనలు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రెండు కొత్త నగర పంచాయతీలు
గురజాల, దాచేపల్లి మండల కేంద్రాలు ఇక నుంచి నగర పంచాయతీలుగా రూపాంతరం చెందబోతున్నాయి. గురజాల, జంగమేశ్వరపురం గురజాల కేంద్రంగా, దాచేపల్లి, నడికుడి పంచాయతీలు దాచేపల్లి కేంద్రంగా నగర పంచాయతీలుగా రూపాంతరం చెందబోతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రతిపాదనలు అందాయి.
నరసరావుపేట 10, బాపట్ల 3, తుళ్లూరు 13, తాడేపల్లి 11, దాచేపల్లి 9, గురజాల 7, గుంటూరు 1, పొన్నూరు, మంగళగిరిలో 21... ఈ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సుమారు 230 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక్కడ స్థానిక ఎన్నికలు కేవలం మున్సిపల్ పరిధిలోనే ఉంటాయి. 230 ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ కేంద్రాలను రద్దు చేస్తున్నారు.
రద్దయ్యే ఎంపీటీసీలు
జిల్లాలో నరసరావుపేట, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, తాడేపల్లి, మున్సిపల్ కేంద్రాలకు సమీపంలోని గ్రామాలు, పట్టణ, నగర ప్రాంతాల్లో కలవబోతున్నాయి. దాచేపల్లి, గురజాల మేజర్ పంచాయతీలు నగర పంచాయతీలుగా రూపాంతరం చెందుతున్నాయి. ఆయా మున్సిపల్, నగరపాలక సంస్థలు కలిసే గ్రామాల వివరాలు..