పవన్ వర్సెస్ ప్రభాస్ ఫ్యాన్స్.. భీమవరంలో ఉద్రిక్తత.. 144 సెక్షన్

శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (14:08 IST)
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఫ్యాన్స్ ఘర్షణపడ్డారు. దీంతో తీవ్ర ఉద్రిక్తవాతావరణం నెలకొంది. ఫలితంగా అక్కడ 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. అయితే, పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య తలెత్తిన ఈ ఘర్షణ ఇపుడు రెండు కులాల వైరంగా మారిపోయింది. ఫలితంగానే ఈ ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. 
 
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2వ తేదీని పురస్కరించుని భీమవరంలో భారీ ఫ్లెక్సీలు, కటౌట్‌లు ఏర్పాటు చేశారు. వీటిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే తగులబెట్టారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహోద్రుక్తులయ్యారు. అంతటితో ఊరుకోని ఫ్యాన్స్ అనుమానిత వ్యక్తుల ఇళ్లపై దాడికి తెగబడ్డారు. వారి ఇళ్ళు, ఇతర ఆస్తులను ధ్వంసం చేశారు. 
 
వీరిలో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వీరు కూడా రెచ్చిపోయారు. ఒక హీరో ప్లెక్సీలను మరో హీరో అభిమానులు తగులబెట్టుకుంటూ, ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఇది చివరకు రెండు కులాల మధ్య గొడవగా మారిపోయింది. దీంతో భీమవరంలో తీవ్ర ఉద్రిక్తపరిస్థితి నెలకొంది. పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు శుక్ర, శనివారాల్లో పట్టణ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. 
 
ఎవరైనా అల్లర్లకు కారణమైతే, వారిపై క్రిమినల్ కేసులు పెడతామని, వారి చదువు నాశనమవుతుందని హెచ్చరిస్తున్నారు. కాగా, తమ అభిమానుల గొడవలపై అటు పవన్ గానీ, ఇటు ప్రభాస్ గానీ ఇంతవరకూ స్పందించక పోవడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి