రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరిస్తుందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. గడచిన మూడేళ్లుగా జిల్లా, డివిజన్ స్థాయి అధికారుల పోస్టులు ఖాళీలను భర్తీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజుకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అధికారుల సంఘం ప్రతినిధులు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఉద్యోగులు పలువురు నగరంలోని మంత్రి అతిధిగృహం కార్యాలయంలో మంత్రి సీదిరి అప్పలరాజును కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పశు సంవర్ధక శాఖ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జయచంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా పశు పోషకులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.
మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడుతుందని, ఉద్యోగులు కూడా మరింత అంకిత భావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. రానున్న కాలంలో ఉద్యోగుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఉద్యోగులకు మంత్రి హామీ ఇచ్చారని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ తుమ్మల సాయిగోపాల్ తెలిపారు.
మంత్రిని కలిసి అభినందించిన వారిలో పశుసంవర్థక శాఖ కృష్ణాజిల్లా సంయుక్త సంచాలకులు డాక్టర్ విద్యాసాగర్, లబ్బీపేట వెటర్నరి సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ సంయుక్త సంచాలకులు డాక్టర్ ఠాగూర్, డాక్టర్ సుజని, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ గోపీచంద్, డాక్టర్ సోమయ్య, డాక్టర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.