దేశం కరోనా కోరల్లో చిక్కుకుంది. ఈ వైరస్ వ్యాప్తి ప్రభావం అధికంగా ఉండటంతో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిరోజు చెపుతూనే ఉన్నాయి. కానీ, ఎంతో మంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ, మాస్కులను ధరించకుండా తమ వంతుగా కరోనా విస్తరణకు కారకులవుతున్నారు. తాజాగా గుంటూరులో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించిన పాపానికి ఓ కార్పొరేటర్‌పై ఒక యువకుడు, అతని స్నేహితులు కలిసి దాడిచేశారు. ఆ తర్వాత ఆ కార్పొరేటర్ అనుచరులు వచ్చిన ఆ యువకుడిని చితకబాదారు.
బుధవారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు నగరంలో 32వ డివిజన్ కార్పొరేటర్ వెంకటకృష్ణచారి ఉదయం బ్రాడీపేటలో పర్యటించారు. బ్రాడీపేట నాలుగో లైన్‌లోని సాయిచరణ్ బాయ్స్ హాస్టల్ వద్ద యువకులు గుమిగూడి ఉండటాన్ని గమనించారు. అక్కడికి వెళ్లిన కార్పొరేటర్ మాస్కు ధరించని యువకుడిని గట్టిగా మందలించారు.