హర్యానా ఎన్నికలు : బీజేపీని దెబ్బకొట్టిన ఆరు స్థానాలు.. లేకుంటేనా..

శనివారం, 26 అక్టోబరు 2019 (15:07 IST)
హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇటీవల వెల్లడయాయి. మొత్తం 90 అసెంబ్లీ సీట్లుండే హర్యానా రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 సీట్లు కావాల్సి వుంది. కానీ, బీజేపీ కనీస మెజార్టీకి ఆరు సీట్ల దూరంలో ఆగిపోయింది. అంటే బీజేపీకి 40 సీట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి 31, జేజేపీకి 10, మిగిలిన సీట్లలో ఇతరులు గెలుపొందారు. దీంతో జేజేపీ సహకారంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 
 
అయితే, రాష్ట్రంలోని ఆరు స్థానాల్లో అత్యంత స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం, ప్రభుత్వం ఏర్పాటుకు ఆరు స్థానాలే తక్కువ కావడంతో కమలనాథులు తెగ మథనపడిపోతున్నారు. మరికాస్త శ్రమించి ఉంటే అక్కడ కూడా గెలిచేవారమని, ఇప్పుడీ తిప్పలు ఉండేవి కావని భావిస్తున్నారు. 
 
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రేవారీ, ములానా, నీలోఖేరి, రాదూర్‌, రోహ్తక్‌, ఫరీదాబాద్‌ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు చాలా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. రేవారీలో 1317 ఓట్లు, ములానాలో 1688, నీలోఖేరిలో 2222, రాదూర్‌లో 2,541, రోహ్తక్‌లో 2,735, ఫరీదాబాద్‌లో 3,242 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. 
 
అన్నిచోట్ల కలిపితే ఓట్ల తేడా కేవలం 6,877 మాత్రమే. ఈ మాత్రం ఓట్లు సాధించగలిగి ఉంటే బాగుండేదని, అపుడు ఇతర పార్టీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదని వారు అభిప్రాయపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు