అమరావతి, జులై,6: రాష్ట్రంలో ప్రస్తుతం వైద్య,ఆరోగ్య శాఖలో అమలవుతున్న హెల్త్ ఇన్సూరెన్స్ పధకాల పనితీరు, అమలుపై వాషింగ్టన్ యూనివర్సీటి, బిల్ అండ్ మిలిందాగేట్స్, NABH క్వాలిటీ కౌన్సిల్ కమిటీ ప్రతినిధులతో వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. గురువారం సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఆరోగ్య రక్ష పథకంపై మొట్టమొదటిసారిగా బిల్ అండ్ మిలిందాగేట్స్, NABH క్వాలిటీ కౌన్సిల్ కమిటీతో సమావేశమయినట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్రప్రజలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం "డా.ఎన్టీఆర్ వైద్య సేవ", "ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పధకం", "పాత్రికేయుల ఆరోగ్య సంరక్షణా పథకంతో పాటుగా ఆ మూడు పథకాల క్రింద లబ్ధి పొందని వారికోసం "ఆరోగ్యరక్ష"ను ప్రవేశపెట్టినట్లు మిలిందా ప్రతినిధులకు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. నెలకు రూ.100 ప్రీమియంతో రూ.2 లక్షల వరకు వ్యక్తిగత ఆరోగ్య బీమాతో పాటు 1044 వ్యాధులకు చికిత్స అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
దేశంలోనే మొట్టమొదటిసారిగా మధ్యతరగతి కుటుంబాల కోసం ఏపీ ప్రభుత్వం "ఆరోగ్యరక్ష" పధకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఆరోగ్య రక్ష పధకంను విజయవంతంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లేందుకు మిలిందా ప్రతినిధుల సూచనలు, సలహాలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికి ఆరోగ్యం, అందరికి హెల్త్ ఇన్సూరెన్స్ అందాలన్నదే సీఎం చంద్రబాబునాయుడు గారి ఉద్దేశ్యమని మంత్రి తెలిపారు. ఈ నెల 9 నుండి రాష్ట్రంలో ఉన్న 7 పివో ఐటీడీఏ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో, తండాల్లో మంత్రి వారంరోజుల పాటు విస్తృతంగా పర్యటిస్తున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో వైద్య,ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఎన్టీఆర్ వైద్య సేవ సిఈవో రవిశంకర్ అయ్యన్నార్, వాషింగ్టన్ యూనివర్సీటి డైరక్టర్ అనిర్భన్ బసు, బిల్ అండ్ మిలిందాగేట్స్ ప్రతినిధులు అలికేష్, ఉషాకిరణ్, NABH క్వాలిటీ కౌన్సిల్ కమిటీ ప్రతినిధులు హరీష్ నాడ్కరిని, వైద్య,ఆరోగ్య శాఖ సలహాదారు జితేందర్ శర్మ, డి.ఎమ్.ఈ సుబ్బారావు, ఎన్టీఆర్ వైద్య సేవ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.