తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెరాస ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనేక సాగునీటి ప్రాజెక్టులను చేపడుతున్న విషయం తెల్సిందే. ఈ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన భూములను రైతుల నుంచి బలవంతంగా సేకరిస్తోంది. ఇందులోభాగంగా, మహబూబ్‌నగర్ జిల్లాలోని వట్టెం రిజర్వాయర్ భూసేకరణను కారుకొండ రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
దీనిపై పలువురు రైతులు కోర్టును ఆశ్రయించారు. దీంతో భూసేకరణ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. భూసేకరణ కోసం రైతులను ఎందుకు బెదిరిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసింది. ముందు రైతుల అభ్యర్థనలను పరిశీలించాలని... అప్పటివరకు భూసేకరణను నిలిపివేయాలని ఆదేశించింది. అలాగే, రైతులతో ఖాళీ బాండ్ పత్రాలపై సంతకాలు ఎందుకు చేయిస్తున్నారని ప్రశ్నించింది.