26 లక్షల మందికి ఇళ్ల స్థలాలు: రామాయపట్నం పోర్టుకు అడ్డంకుల తొలగింపు

గురువారం, 5 మార్చి 2020 (05:50 IST)
రాష్ట్రంలో ఉగాది రోజున సుమారు 26 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

వెలగపూడిలోని సచివాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన బుధవారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం భోగాపురం ఎయిర్‌పోర్ట్, రామాయపట్నం పోర్టు నిర్మాణం, ఖరీఫ్‌లో రైతులకు విత్తనాలు, తదితర కీలక నిర్ణయాలు తీసుకుంది.

రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. 
 
•  ఉగాది నాటికి సుమారు 26 లక్షల ఇళ్ల స్ధలాల పంపిణీ కార్యక్రమానికి కేబినెట్‌ ఆమోదం:
ఉగాది రోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. స్థలం పొందిన లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవడానికి అనుమతి పత్రంతో పాటు, ఐదేళ్ల వరకు స్థలం బ్యాంకులో తనఖా పెట్టుకోవడానికి, ఐదేళ్ల తర్వాత విక్రయానికి హక్కు కల్పిస్తూ పట్టా ఇవ్వబోతున్నామన్నారు.

ఇందుకోసం అందరు తహశీల్దార్లకు జాయింట్‌ సబ్‌ రిజిస్టార్లుగా హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేసేందుకు 43,141 ఎకరాల భూమిని సిద్ధం చేశామని తెలిపారు. ఇందులో 26,976 ఎకరాల ప్రభుత్వ భూమి, 16,164 ప్రైవేటు భూమి ఉందని వివరించారు.

యుద్ధ ప్రాతిపదికన ప్లాట్లు అభివృద్ధి, మార్కింగ్ చేసి లబ్ధిదారులకు ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. ప్రతీఏటా 6 లక్షలకు పై చిలుకు ఇళ్ల చొప్పున వచ్చే నాలుగేళ్లలో 26 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు.ఈ కాలనీలన్నింటికీ వైఎస్సార్‌ జగనన్న కాలనీలుగా నామకరణం చేస్తామన్నారు. 
 
•  ఎన్పీఆర్ ప్రక్రియను అబయెన్స్ లో ఉంచేందుకు కేబినెట్ ఆమోదముద్ర:
నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ పై క్షేత్ర  స్ధాయి నుంచి వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌పై కేబినెట్ లో చర్చ జరిగిందన్నారు. కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని.. వారిలో అభద్రతాభావం తొలగించాలని, 2010 నాటి ప్రశ్నావళికే పరిమితం కావాలని, తదనుగుణంగా ప్రస్తుతం ఉన్న ఎన్‌పీఆర్‌ ప్రశ్నల నమూనాను మార్పుచేయాలని తీర్మానం చేశామన్నారు.

అప్పటివరకూ ఎన్‌పీఆర్‌ ప్రక్రియను అబయెన్స్‌లో ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదముద్ర వేసిందన్నారు.
 
•  పీపీపీ విధానంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ :
బిడ్డింగ్‌లో కాంట్రాక్ట్‌ దక్కించుకున్న జిఎమ్మార్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌(హైదరాబాద్‌) సంస్థ.మరో 362.55 ఎకరాల భూసేకరణచేయాల్సి ఉండగా.... దీనికి అవసరమైన రూ.280 కోట్లు ధనాన్ని రుణం రూపంలో తెచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ ఎయిర్‌పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌కు(ఏపీఏడిసిఎల్‌) అనుమతి జారీ చేస్తూ కేబినెట్ నిర్ణయించిందన్నారు.
 
•  రామాయపట్నం పోర్టు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
•  భావనపాడు, మచిలీపట్నంలలో పోర్టుల ఏర్పాటుకు ఇదివరకే ప్రభుత్వం చర్యలు 
•  ఏపీ జెన్‌కో, ఏపీపిడిసిఎల్‌ (ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) చెరో రూ.1000 కోట్లు చొప్పున, మొత్తంగా రూ.2వేల కోట్ల ప్రభుత్వం నుంచి బ్యాంకు గ్యారంటీకి కేబినెట్‌ ఆమోదం. తద్వారా తాజా రుణాలు పొందే అవకాశం, ఈ రుణాలతో నిర్మాణంలో ఉన్న కృష్ణపట్నం 800 మెగావాట్లు, వీటీపీఎస్‌లో 800 మెగావాట్ల థర్మల్‌ కేంద్రాలను పూర్తి చేయాలని నిర్ణయం.

•  రుణం తీసుకునేందుకు సీడ్‌ కార్పొరేషన్‌కు అనుమతి : 
ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు రూ.500 కోట్లు ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం. దీనివల్ల కొత్తరుణాల లభ్యత, తద్వారా తొలకరిలో ముమ్మరంగా విత్తన పంపిణీ జరుగుతుందన్నారు.
 
•  కాకినాడ సమీపంలో తొండంగి మండలం కోన గ్రామం వద్ద పోర్టు నిర్మాణం కోసం 9 నెలల  కాలవ్యవధిని పొడిగిస్తూ .. కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్‌కు అనుమతినిస్తూ కేబినెట్‌ ఆమోదం
 
•  కాకినాడ ఎస్‌ఈజెడ్‌ లిమిటెడ్‌లో 49 శాతం ఈక్విటీని అదానీ పోర్టు అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ లిమిటెడ్‌కు బదిలీ చేస్తూ చేసుకున్న ఒప్పందానికి  కేబినెట్‌ ఆమోదం  
 
•  ప్రకాశం జిల్లా  ఒంగోలులో గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీకి కేటాయించిన 1.96 ఎకరాల భూమి కేటాయింపు రద్దు చేస్తూ జారీ చేసిన జీవోకి కేబినెట్‌ ఆమోదం. తిరిగి ఆ భూమిని వాటర్‌ రీసోర్స్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌ మెంట్‌కు కేటాయించి, ఎన్‌ఎస్‌పి కాలనీ విస్తరణకు వినియోగించాలని నిర్ణయం .
 
•  కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సున్నిపెంటలో 4 గ్రామ సచివాలయాల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం. అందులో 44 పోస్టుల భర్తీకి కేబినెట్‌ అనుమతి.
 
•  రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్, భూ అక్రమాలపై కేబినెట్‌ సబ్‌కమిటీ నివేదికలోని అంశాలపై విచారణ అధికారాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)కు అప్పగిస్తూ కేబినెట్‌ ఆమోదం

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు