అమరావతి సచివాలయంలో గుర్రం హాల్ చల్.. పరుగులు పెట్టిన సెక్యూరిటీ సిబ్బంది

శుక్రవారం, 3 మార్చి 2017 (11:11 IST)
అమరావతి, వెలగపూడి సచివాలయంలో భద్రత సిబ్బంది నిర్లక్ష్యం బయట పడింది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల కొలువు ఉండే సచివాలయంలో ఎటువంటి అనుమతులు లేకుండానే సామాన్య పౌరుడు యధేచ్చగా గుర్రంపై వచ్చి స్వారీ చేశాడు. సచివాలయంలో ప్రధాని రహదారిపైన హడావుడి చేశాడు. దాదాపుగా సీఎం ఛాంబర్ సమీపంలోకి వెలగపూడి గ్రామంకు చెందిన కారుమంచి అప్పాజీ గుర్రంపై వచ్చాడు. సచివాలయంలోకి రావాలంటే ముందగా మెయిన్ గేటు వద్ద ఉన్న సిబ్బంది చెక్ చేసిన తర్వాతే ఎవరినైనా లోపలికి అనుమతి ఇస్తారు.
 
అలాంటిది ఒక సామాన్య వ్యక్తి స్వేచ్ఛగా వివిఐపీలు ఉండే ప్రదేశంలో తిరిగాడు అంటే వెలగపూడి సచివాలయంలో భద్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే సీఎం చంద్రబాబు మావోయిస్టుల నుండి ప్రమాదం పొంచివుందని అనేక సార్లు ఇంటిలిజెన్స్ అధికారులు హెచ్చరికలు కూడా చేశారు. 
 
గతంలో రాజధాని ప్రాంతంలో ఒక మహిళా మావోయిస్టును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటనలు కూడా చోటుచేసుకుంది. ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన భద్రత సిబ్బంది సచివాలయంలో పూర్తి నిర్లక్ష్యంగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పారావు సచివాలయం ప్రాంగణంలో గుర్రంపైన స్వారీ చేయడాన్ని ఆలస్యంగా గమనించిన భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని బయటకు పంపారు. 

వెబ్దునియా పై చదవండి