తల బొల్లారంలో.. మొండెం మియాపూర్‌లో.. ఆటో డ్రైవర్ దారుణ హత్య

శుక్రవారం, 23 ఆగస్టు 2019 (14:14 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. ఓ ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. పాతకక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది. అయితే, దుండగులు... అత్యంత కిరాతకంగా నడుచుకున్నారు. ఆటో డ్రైవర్‌ను హత్య చేసిన తర్వాత మృతదేహం నుంచి తలను వేరు చేసి బొల్లారంలో పడేశారు. తల లేని మొండెంను మియాపూర్‌లో విసిరివేసి వెళ్లిపోయారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీకాంత్, అతని బామ్మర్ధి శ్రీనివాస్ కలిసి వడ్డీవ్యాపారం చేస్తుంటారు. వీరిద్దరూ ఆటో డ్రైవర్ శ్రీకాంత్ ఆటోలోనే ప్రయాణం చేస్తుంటారు. అలాగే, రోజువారీ వడ్డీ వ్యాపారం చేసే శ్రీకాంత్ యాదవ్ ఆటో డ్రైవర్లకు వడ్డీలకు డబ్బులిచ్చి వసూలు చేస్తుంటాడు. 
 
ఈ క్రమంలో ప్రవీణ్, రాజేశ్ అనే ఇద్దరు ఆటో డ్రైవర్లకు శ్రీకాంత్ డబ్బులిచ్చాడు. ఆ డబ్బును వసూలు చేసేందుకు శ్రీకాంత్ గురువారం రాత్రి బొల్లారం చౌరస్తాకు వెళ్లాడు. డబ్బుల విషయంలో రాజేశ్‌తో శ్రీకాంత్, శ్రీనివాస్ గొడవపడ్డారు. 
 
మరో ఆటో డ్రైవర్ ప్రవీణ్‌ను తీసుకొని ధర్మపురి క్షేత్రం వైపు వెళ్లారు. అయితే అక్కడ ప్రవీణ్‌పై విచక్షణారహితంగా దాడి చేస్తుంటే.. రాజేశ్ భయపడి పారిపోయాడు. ఆ తర్వాత శ్రీకాంత్, శ్రీనివాస్‌పై మియాపూర్ పోలీసులకు రాజేశ్ ఫిర్యాదు చేశాడు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
 
అయితే ప్రవీణ్‌ను హత్య చేసిన శ్రీకాంత్, శ్రీనివాస్.. మొండెం నుంచి తలను వేరు చేశారు. తలను తీసుకెళ్లి బొల్లారంలో పడేశారు. క్లూస్‌టీం తలను స్వాధీనం చేసుకుంది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ప్రవీణ్ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమా? లేక పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు