దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఏడవ రోజైన నిజ ఆశ్వయుజ శుద్ధ అష్టమి సందర్భంగా బుధవారం ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ శ్రీదుర్గాదేవిగా దర్శనమిస్తుంది. నిజరూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఇంద్రకీలాద్రిపై బారులు తీరి ఉన్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్టట్లే అని భక్తితో దుర్గమ్మను కొలుస్తున్నారు.
అష్టమి నాడు దుర్గాదేవిగా భక్తులను సాక్షాత్కారిస్తుంది జగదంబ. దుర్గముడనే రాక్షసుడిని సంహరించినందున దుర్గ అని పేరొచ్చింది. దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపంగా భక్తులు దుర్గాదేవిని కొలుస్తారు. ఎరుపు రంగు చీరలో త్రిశూలం చేతపట్టి కోటి సూర్యప్రభలతో వెలుగొందే ఈ అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో పూజిస్తే శత్రు బాధలు నశిస్తాయి. ఈ రోజున అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గారెలు, కదంబం (కూరగాయలు, అన్నం కలిపి వండేది) బెల్లం, పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజున భక్తులు దుర్గాష్టమిగా కూడా జరుపుకుంటారు.