చంద్రబాబు విజన్ నచ్చింది.. ఏపీలో ఫ్యాక్టరీ స్థాపిస్తాం.. ఇసుజు వైస్ ఛైర్మన్

గురువారం, 27 నవంబరు 2014 (13:35 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక స్పష్టమైన విజన్‌తో తమ దేశానికి వచ్చారని, ఆయన విజన్‌ను స్లైడ్స్ రూపంలో కళ్ళారా చూడటంతో తమకు ఎంతగానో నచ్చిందని, అందువల్ల ఏపీలో తమతో పాటు మరికొన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని ఇసుజు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అన్నారు. 
 
ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న చంద్రబాబు గురువారం జపాన్‌‌కు చెందిన ఆ దేశ ఆటోమొబైల్ దిగ్గజం ఇసుజు కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తమ ట్రక్కుల తయారీ యూనిట్లు భారత్‌లో 10 దాకా ఉన్నాయని ఆయన చెప్పారు.
 
అయినా, భారత మార్కెట్‌లో తమ కంపెనీ వాటా నామమాత్రమేనని ఆయన వెల్లడించారు. ఇప్పటికే భారత్‌లో యూనిట్లు ఉన్నా ఏపీలో మరో యూనిట్‌‌‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. నిధులు, సాంకేతిక పరిజ్ఞానం తమ వద్ద ఉన్నాయని, తమకు కావాల్సిందల్లా ప్రభుత్వ సంపూర్ణ సహకారం మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి