రెండు నెలల్లో ఊడాల్సింది.. రెండేళ్లు పొడిగింపు.. జగన్ ఫైర్..!

సోమవారం, 4 మే 2015 (14:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ హత్యలను వెంటనే అడ్డుకోవాలని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను సోమవారం కలిసి విజ్ఞప్తి చేశారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో రాజకీయ హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన పార్టీ నేత ప్రసాదరెడ్డి హత్యను ఆయన ప్రస్తావించారు. వైసీపీని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు సర్కారు యత్నిస్తోందని ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. హత్యారాజకీయాలకు పాల్పడుతున్న అధికారపక్షాన్ని నిలువరించాలని ఆయన గవర్నర్‌ను కోరారు. 
 
అనంతపురం జిల్లాలో ఎనిమిది హత్యలు జరిగాయని, ఇవన్నీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీజీపీ రాయుడులు దగ్గరుండీ చేయిస్తున్నారనీ ఆరోపించారు. హత్యలకు సహకరించేందుకే రెండు నెలల్లో పదవీ విరమణ చేయాల్సిన రాయుడిని రెండేళ్ళ పాటు సర్వీసును పొడిగించి డీజీపీగా నియమించారని మండిపడ్డారు. అందువల్ల తమ పార్టీ కార్యకర్తలకు రక్షణ కల్పించాలని కోరారు. అంతేకాకుండా, అనంతపురం జిల్లాలో జరిగిన హత్యలపై సీబీఐతో విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి