అధికార మదం కేసీఆర్ తలకెక్కింది : జానారెడ్డి ఆగ్రహం

బుధవారం, 17 సెప్టెంబరు 2014 (13:56 IST)
తెలంగాణ ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్న కేసీఆర్‌కు అధికార మదం, దర్పం తలకెక్కిందని అందుకే ఇతర పార్టీల నేతలను కించ పరిచేలా వ్యాఖ్యలు చేస్తూ హేళన చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అసెంబ్లీ విపక్ష నేత కె జానారెడ్డి మండిపడ్డారు. ఇదే అంశంపై ఆయన బుధవారం మాట్లాడుతూ.. కేసీఆర్ వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. 
 
మెట్రో రైల్, ఇతర పార్టీలవారిని ఆకర్షిస్తూ, ఫిరాయింపులను ప్రోత్సహించడం వంటివి చేయడం ద్వారా కేసీఆర్ ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పైపెచ్చు విపక్ష నేతలను కించ పరిచేలా మాట్లాడుతూ మీడియా ముఖంగా హేళన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 
 
ఇకపోతే కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరిన ఇల్లెందు ఎమ్మెల్యే కనకయ్యపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ మదుసూదనాచారికి వినతిపత్రం ఇచ్చినట్టు గుర్తు చేశారు. గెలిచిన పార్టీ, పదవికి రాజీనామా చేయకుండా వేరే పార్టీలో చేరడం అనైతికం, చట్టవిరుద్ధమన్నారు. స్పీకర్ రాజ్యాంగపరంగా వ్యవహరించి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. 

వెబ్దునియా పై చదవండి