బీజేపీ వైపు టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అడుగులు పడుతున్నాయి. దివాకర్ రెడ్డి .. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలవనున్నారు.
సోమవారం ఉదయం 11 గంటలకు ఆర్ అండ్ బి అతిథి గృహంలో కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పోలీస్ కేసులు, దివాకర్ ట్రావెల్స్‌పై ఆర్టీఏ దాడులను కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నారు. కాగా ఇప్పటికే బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ను జేసీ కలిశారు. జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం ఫిబ్రవరిలో బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. అయితే జేసీ వర్గీయులు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు.
రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉండాలని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. లేనిపక్షంలో రాయలసీమ వాసుల చిరకాల వాంఛ అయిన గ్రేటర్ రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి కూడా ఆయనతో గళం కలిపారు.
జేసీ ఆదివారం అనంతపురం జిల్లా యాడికిలో మాట్లాడారు. ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని ఉంటుందని, మూడు రాజధానులు ఎలా ఉంటాయని జనార్దనరెడ్డి ప్రశ్నించారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని రాజధాని ప్రజలకు న్యాయం చేసి.. అమరావతిని తరలించకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
లేదంటే నెల్లూరు, ప్రకాశం జిల్లాలను రాయలసీమలో కలిపి గ్రేటర్ రాయలసీమన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని.. కాదంటే కర్నూలు జిల్లాను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు.
పీవోకేను ఆక్రమిస్తే బీజేపీలో చేరతా
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)ను ఆక్రమిస్తే బీజేపీలో చేరతానని జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ను ఆయన కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఆ సమయంలో మీడియాతో మాట్లాడారు. జాతీయ పార్టీలతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు.
ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యం దేశంలో తగ్గిపోతూ వస్తోందని తెలిపారు. అయితే ప్రాంతీయ పార్టీలు ఉన్నంత వరకూ తెలుగుదేశంలోనే ఉంటానన్నారు.