తెలుగు రాష్ట్రాలు విడిపోయినా.. తెలుగు ప్రజలం కలసే ఉన్నాం... సుప్రీం కోర్టు జడ్జి రమణ

శనివారం, 4 జులై 2015 (06:43 IST)
భౌగోళికంగా తెలుగు వారు రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఉండవచ్చుగాక, మానసికంగా తెలుగువారం కలిసే ఉన్నాం. తెలుగు ప్రజలంతా అన్నదమ్ముల్లా, అక్కచెల్లెళ్లలా, కలిసి ఉండాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రమణ అమెరికాలో పిలుపునిచ్చారు. డెట్రాయిట్‌ నగరంలో జరుగుతున్న తానా 20వ మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 
 
తెలుగు ప్రజలు.. తెలుగు బిడ్డలు నైరాశ్యాన్ని వదిలి సంపదను సృష్టించి సర్వతోముఖాభివృద్ధితో మహాప్రస్థానం సాగించాల్సినటువంటి రోజులు ముందున్నాయన్నారు. సమష్టిగా కృషి చేసి తెలుగుజాతి అభివృద్ధికి కష్టపడకపోతే రానున్నరోజులు చీకటి రోజులుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. నవ్యాంధ్ర, నవ తెలంగాణ యువతరానివే. సుసంపన్నం చేసుకోండి. తీర్చిదిద్దుకోండంటూ పిలుపునిచ్చారు. 
 
ఖనిజ సంపద, అపారమైన వనరులు కలిగి ఉన్న తెలుగురాష్ట్రాలకు మీ మేధస్సు, కఠోర శ్రమ జోడిస్తే అద్భుతాలను సృష్టించగలమని అమెరికాలో ఉన్న తెలుగువారిని ఉద్దేశించి అన్నారు. అమెరికాలో ఎన్నో రంగాల్లో ఘనవిజయాలు సాధిస్తూ ముందుకు సాగుతున్న తెలుగువారిని ఆయన అభినందించారు.

వెబ్దునియా పై చదవండి