విశ్వనటుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్‌లు ఆదివారం అర్థగంటకు పైగా భేటీ అయ్యారు. స్థానిక పోయెస్ గార్డెన్‌లోని రజనీకాంత్ నివాసంలో ఈ భేటీ జరిగింది. అయితే, ఈ సమావేశంలో వీరిద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరిగినట్టు సమాచారం. ఇప్పటివరకు అందరూ స్నేహితుడిగానే కమల్ హాసన్ రజనీని కలిసి వెళ్ళాలని అనుకుంటున్నారు. ఇదే ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. ఇద్దరు కూడా అదే విషయానికి మీడియాకు చెప్పారు.
కానీ కమల్ హాసన్, రజనీకాంత్ మధ్య జరిగిన చర్చల్లో జరిగింది వేరే. అదే ఒకే పార్టీలో ఉందాం.. కలిసి ముందుకెళదామని కమల్ చెప్పినట్టు సమాచారం. అంతేకాదు సిఎంగా మీరే ఉండండి.. డిప్యూటీ సిఎంగా నేనుంటాం. అవినీతి లేని పాలనను అందిద్దాం.. ప్రజలకు కష్టం అనేదే లేకుండా చేద్దాం. మచ్చలేని వ్యక్తులను మన క్యాబినెట్‌లోకి తీసుకుందాం.. ఇలా ముందుకు వెళితే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించగలుగుతాం అని కమల్ చెప్పారట.
అయితే రజనీ మాత్రం కాస్త సమయం తీసుకుందాం.. అన్ని ఆలోచించి నేను చెబుతాను అంటూ కమల్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రజనీ నిలబడినా, కమల్ హాసన్ నిలబడినా ఖచ్చితంగా వీరు గెలవడం ఖాయమే. అంతేకాకుండా వీరి పార్టీలోని నాయకులను గెలిపించుకుని తీరుతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.