తెలంగాణ రాష్ట్ర శాసనసభ త్వరలోనే రద్దుకానుంది. ఇందుకోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ ముహూర్తం ఖరారు చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అనేకంగా ఈనెల 5 లేదా 6వ తేదీల్లో మరోమారు రాష్ట్ర మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి ఇందులో అన్ని విషయాలపై చర్చించి అసెంబ్లీని రద్దు చేయాలని ఆయన భావిస్తున్నారు.
నిజానికి ముందస్తు ఎన్నికల వస్తాయని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఆదివారం కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేవలం పాలనాపరమైన అంశాలకే పరిమితమైనట్టు సమాచారం. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటే.... అసెంబ్లీని రద్దు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దాంతో అసెంబ్లీ రద్దు సిఫారసు చేయడం కోసం ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం ఈ నెల 5-6 తేదీల్లోఒకరోజు జరిగే అవకాశం ఉంది.
ఈ సమావేశంలో ఇతర అంశాలేవి లేకుండా నేరుగా అసెంబ్లీ రద్దుకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోపక్క త్వరలోనే మంత్రివర్గ సమావేశం ఉంటుందని, ఆ సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలను పంపించాలని ఆదివారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఆయా విభాగాలకు సర్క్యూలర్ జారీచేశారు. శాసనసభ రద్దుకు సీఎం ముహూర్తం ఖరారు చేయడం వల్లే సీఎస్ ఈ సర్క్యులర్ జారీ చేసివుంటారని తెరాస శ్రేణులు చెబుతున్నారు.