రెడ్‌శాండిల్ క్వీన్‌గా పేరుగాంచిన మహిళా స్మగ్లర్, మోడల్ సంగీతా చటర్జీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చిత్తూరు సబ్ జైలులో ఉంటున్న ఆమె ఫినాయిల్ తాగింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు చెపుతున్నారు.
కాగా, ఎర్రచందనం అక్రమ రవాణాలో కోట్లకు పడగలెత్తిన మహిళా స్మగ్లర్ సంగీతా చటర్జీని చిత్తూరు పోలీసులు గత యేడాది అరెస్టు చేసిన విషయం తెల్సిందే. కోల్‌కతాలో అదుపులోకి తీసుకున్నారు. ఓ విమాన సంస్థలో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తూ, ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మణ్‌కు దగ్గరైన సంగీత.. అక్రమ రవాణాలో అడుగుపెట్టింది.. ఎర్రచందనం అక్రమ రవాణాతో పాటు హవాలా ద్వారా సంగీత భారీగా నగదు మార్చింది.
దీనిపై లోతుగా అన్వేషించిన చిత్తూరు పోలీసులు గత ఏడాది కోల్‌కతాలోని ఆమె నివాసంలో దాడులు చేశారు.. విలువైన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను తెరిపించి, నకిలీ తుపాకీ లైసెన్సులనూ స్వాధీనం చేసుకున్నారు. పలుసార్లు ఆమెను అరెస్టుచేయాలని పోలీసులు అక్కడి న్యాయస్థానాన్ని ఆశ్రయించినా అడ్డంకులు ఎదురయ్యాయి. 15 రోజులపాటు కోల్‌కతాలో రెక్కీ నిర్వహించిన పోలీసులు చివరకు సంగీతను అరెస్టు చేశారు.