సభ్యత.. సంస్కారం ఉంది.. కేసీఆర్‌లా మేము తిట్టలేం : కొనకళ్ళ నారాయణ

మంగళవారం, 7 జులై 2015 (20:00 IST)
తమకు సభ్యత, సంస్కారం ఉందని, అందువల్ల తెరాస అధినేత కేసీఆర్‌లా తాము తిట్టలేమని మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణ అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తనపై చేసిన విమర్శలకు కొనకళ్ళ మంగళవారం సమాధానమిచ్చారు. ముఖ్యంగా ఎంపీలుగా తామేం చేయాలో పవన్ కల్యాణ్ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. 
 
రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పడు వ్యవహరించే తీరువేరు, అధికారపక్షంలో ఉన్నప్పుడు వ్యవహారశైలి వేరని అన్నారు. ప్రజా సమస్యలపై పవన్ కల్యాణ్ స్పందించాల్సిన తీరు ఇది కాదన్నారు. పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ ద్వారా కాకుండా, నేరుగా వచ్చి తమను సంప్రదించి, సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన సూచించారు. 
 
విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై తాము నిత్యం పోరాటం చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. విభజన కారణంగా ఉత్పన్నమైన సమస్యలు పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. తిడితే కేసీఆర్‌లా తిట్టాలి, పడితే సీమాంధ్ర ఎంపీల్లా పడాలని పవన్ కల్యాణ్ అంటున్నారని, తమకు సభ్యత, సంస్కారం ఉంది కనుక, కేసీఆర్‌లా తిట్టడం లేదని అన్నారు. అందుకే అలా మాట్లాడడం లేదని ఆయన స్పష్టంచేశారు. బూతులు తిట్టుకోవడంలో పోటీపడకూడదని ఆయన హితవుపలికారు. మిత్రపక్షం కనుక తమ పోరాటం తీరు మారింది తప్ప, పోరాటంలో మార్పు రాలేదని కొనకళ్ళ అన్నారు. 

వెబ్దునియా పై చదవండి