శ్రీశైలం చేరనున్న కృష్ణవేణి.. జూరాల ఒడిలోకి కృష్ణా జలాలు

మంగళవారం, 30 జులై 2019 (19:16 IST)
ఎట్టకేలకు జూరాలకు వరద వచ్చింది. మహారాష్ట్రలో భారీవర్షాలతో ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టులు పూర్తిగా నిండకముందే దిగువకు లక్ష క్యూసెక్కులకుపైగా నీటిని విడుదలచేస్తున్నారు. దీనితో సోమవారం రాత్రి పది గంటల ప్రాంతంలో జూరాలకు పదివేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది.

ఆల్మట్టికి సోమవారం ఉదయం 76,305 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా.. సాయంత్రానికి లక్ష క్యూసెక్కులకు పెరిగింది. అదేస్థాయిలో దిగు వకు వదులుతున్నారు. నారాయణపుర నుంచి సాయంత్రానికి అవుట్‌ఫ్లో సుమారు లక్ష క్యూసెక్కులకు పెంచగా, రాత్రి 8.30 గంటల సమయానికి ఇన్‌ఫ్లో 1.32 లక్షల క్యూసెక్కులకు పెరుగటంతో 1.23 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. 
 
దీంతో సోమవారం మధ్యాహ్నం గూగల్ బరాజ్‌కు చేరుకున్నాయి. సాయంత్రానికి తెలంగాణ- కర్ణాటక సరిహద్దులో రాయిచూర్-హైదరాబాద్ జాతీయ రహదారి బ్రిడ్జి దిగువన కృష్ణా నది వరద తెలంగాణలోకి ప్రవేశించింది. క్రమంగా జూరాల ప్రాజెక్టుకు చేరుతున్నది. తీవ్ర నిరాశల మధ్య మొదలైన ఈ నీటి సంవత్సరంలో ఇప్పుడు ఆశలు చిగురిస్తున్నాయి. కృష్ణాబేసిన్‌లో నీటిపరవళ్లు ఆనందాన్ని నింపుతున్నాయి.

లక్షల ఎకరాల్లో రైతాంగం కోటి ఆశల మధ్య ఎదురుచూస్తున్న జలాలు లక్ష క్యూసెక్కులను మోసుకొచ్చాయి. గత ఏడాది ఇదేనెలలో 18వ తేదీన కృష్ణాజలాలు తెలంగాణలోకి ప్రవేశించగా.. ఇప్పుడు 11-12 రోజులు ఆలస్యంగా వస్తున్నాయి.
 
ఈ ఒరవడి ఉంటేనే దిగువన జలకళ
ప్రస్తుతం ఆల్మట్టి, నారాయణపుర జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఆల్మట్టిలో 129.72 టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యానికిగాను 122.27 టీఎంసీల నీటినిల్వ ఉన్నది. సోమవారం రాత్రి 8.30 గంటల సమయానికి ఆల్మట్టి స్పిల్‌వే నుంచి, మరోవైపు కరంటు ఉత్పత్తి ద్వారా భారీగా నీటిని వదులుతుండటంతో నారాయణపురకు 1.32 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది.

నారాయణపుర నుంచి 1.23 లక్షల క్యూసెక్కులకు నీటిని నీటిని దిగువకు స్పిల్‌వే, కరంటు ఉత్పత్తి ద్వారా వదులుతున్నారు. ఇదే ఒరవడి కొనసాగితే మూడునాలుగు రోజుల్లో శ్రీశైలం జలాశయాన్ని కృష్ణాజలాలు తాకే అవకాశాలున్నాయి.

ఈ నేపథ్యంలో జూరాలపై ఉన్న అన్ని ఎత్తిపోతల పథకాలను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సోమవారం ఉదయం జూరాల జలాశయంలో 1.99 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూరాల కుడి, ఎడమ, సమాంతర కాల్వల ద్వారా నీటిని వదిలి చెరువులను నింపడంతోపాటు కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు పథకాల ద్వారా కూడా నీటి విడుదల ప్రారంభించనున్నారు. 
 
ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
నారాయణపుర నుంచి నీటి విడుదలతో తెలంగాణ యంత్రాగం అప్రమత్తమైంది. నారాయణపేట కలెక్టర్ వెంకట్రావు, ఆర్డీవో శ్రీనివాసులు మక్తల్‌లో అధికారులతో సమీక్షించారు. కృష్ణా మండలంలోని ముడుమాల్, మురారిదొడ్డి గ్రామాల పరిధిలో పర్యటించారు. స్థానికులను అప్రమత్తం చేశారు. రైతులు, మత్స్యకారులు నదిలోకి వెళ్లవద్దని సూచించారు. ప్రస్తుతం నది నీటిపై ఆధారపడి వ్యవసాయంచేస్తున్న రైతుల పంపుసెట్లు మునిగిపోయే అవకాశం ఉన్నందున అన్నింటినీ తీయించినట్టు కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. 
 
వరద వస్తే ఎత్తిపోసుడే : మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పస్పుల వద్ద సోమవారం సాయంత్రం కృష్ణ వరదను మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పరిశీలించారు. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి దిగువన ఉన్న మన రాష్ట్రంలోకి విడుదలైన కృష్ణానది వరదనీరు, మన సరిహద్దుల్లోకి ప్రవేశించిన వెంటనే భీమా ఎత్తిపోతల పథకం పంపింగ్‌ను ప్రారంభించి నీటిని ఎత్తిపోస్తామని ఆయన తెలిపారు. నదీతీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
 
జూరాలలో విద్యుదుత్పత్తికి సర్వం సిద్ధం
రాష్ట్రంలోని జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి సర్వం సిద్ధంచేస్తున్నట్లు తెలంగాణ హైడల్ ప్రాజక్ట్స్ సీఈ సురేశ్ తెలిపారు. మహారాష్ర్టలో కురుస్తున్న వానలకు వరదనీరు ఎప్పుడు వచ్చినా విద్యుదుత్పత్తికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కృష్ణాబేసిన్‌లోని ఆరు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి అంతా సిద్ధం చేసినట్లు తెలిపారు. కృష్ణాజలాలు సోమవారం అర్ధరాత్రి జూరాలకు చేరే అవకాశాలున్నాయన్నారు.

ఒక్కచుక్క కూడా వృథాచేయకుండా విద్యుదుత్పత్తి నిర్వహించడమే లక్ష్యమన్నారు. ఎగువ నుంచి కొనసాగే ప్రవాహాన్ని బట్టి యూనిట్లను పెంచుతామని చెప్పారు. రెండ్రోజుల్లో ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రంలో అన్ని యూనిట్లు వినియోగంలోకి వస్తాయన్నారు.
 
తుంగభద్రకు కొనసాగుతున్న వరద
కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న ఓ మోస్తరు వర్షాలతో తుంగభద్ర ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతున్నది. సోమవారం డ్యాంలోకి 14,683 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా, 1,799 క్యూసెక్కులను దిగువకు విడుదలచేస్తున్నారు. డ్యాంలో ప్రస్తుతం 24.444 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
 
వరదనీటితో ప్రవహిస్తున్న మూసీ నది
మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూసీనది వరదనీటితో ప్రవహిస్తూ మూసీ రిజర్వాయర్‌లోకి చేరుతున్నది. సోమవారం సూర్యాపేట జిల్లా, జాజిరెడ్డిగూడెం శివారులోని మూసీవాగులో వర్షపు నీరు ప్రవహిస్తున్నది. మండలంలోని పలు గ్రామల్లోని చెరువులు, కుంటలు వరదనీటితో కళకళలాడుతున్నాయి. పొలాల్లోకి వచ్చిన కొద్దిపాటి వరదనీటితో వ్యవసాయపనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 
 
200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
నల్లగొండ జిల్లా, కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టుకు పరిసర ప్రాంతాల నుంచి సోమవారం 200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 613 అడుగులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు