రొంపిచెర్ల మండలం పెద్దమల్లెల గ్రామ పంచాయతీ దుస్సావాండ్లపల్లెకు చెందిన సుధారాణి, ఎర్రవారిపాళెం మండలం మెదరపల్లెకు చెందిన పొంతల మహేష్ 8 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి రీతూ, పవన్ చిన్నపిల్లలున్నారు. కుటుంబం జీవనం కష్టంగా ఉండడంతో మూడు సంవత్సరాల క్రితం రొంపిచెర్ల మండలం దుస్పావాండ్లపల్లెకు వచ్చారు. కూలి పనిచేసుకుంటూ ఆ ప్రాంతంలోనే జీవిస్తూ ఉండేవారు.
ఆశించిన మేరకు పనులు లేకపోవడంతో బతుకుదెరువు కోసం రెండేళ్ళ క్రితం మహేష్ కువైట్‌కు వెళ్లాడు. అక్కడ వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తూ కిడ్నీల జబ్బు బారిన పడ్డాడు. దీంతో 11 నెలల క్రితం మళ్ళీ కువైట్ నుంచి రొంపిచెర్ల మండలం దుస్సావారిపల్లెకు వచ్చారు. వైద్య పరీక్షలు చేయించుకుని 9 నెలల క్రితం కువైట్‌కు బయలుదేరాడు.
ఆ సమయంలో ఎర్రావానిపాళెం మండలం మెదరపల్లెకు చెందిన అతని పిన్నమ్మ చిట్టెమ్మ కుమారులు బాలసుబ్రమణ్యం, కిరణ్‌లు కలిశారు. కువైట్‌లో ఉన్న వారి అమ్మకు నూతన వస్త్రాలు తీసుకెళ్ళాలని ఒక బాక్స్ ఇచ్చి పంపారు. దాన్ని మహేష్ కువైట్‌కు తీసుకెళ్ళాడు. అక్కడ విమానాశ్రయంలో పోలీసులు తనిఖీ చేయగా ఆ బాక్స్‌లో డ్రగ్స్ ఉన్నట్లు బయటపడింది.
ఈ కేసులో వారం రోజుల పాటు మహేష్ జైలులో ఉండగా కోర్టు నిన్న మరణశిక్షను విధించింది. ఈ విషయాన్ని అతను ఫోను ద్వారా భార్యకు తెలియజేశాడు. దీంతో స్థానిక పోలీసులను భార్య ఆశ్రయించింది. చిట్టెమ్మ ఇంటికి వెళ్ళి వివరాలు సేకరించగా అక్కడ ఎవరూ లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో మహేష్ కుటుంబం ఉంది. ప్రభుత్వం వెంటనే కలుగజేసుకుని తన భర్తకు ప్రాణభిక్ష పెట్టాలని కుటుంబీకులు కోరుతున్నారు.