ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశమే లేదన్నారు లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్. ప్రత్యేక హోదా కన్నా ఎపికి రావాల్సిన నిధుల కోసం కేంద్రంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని జయప్రకాష్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. ఎపి అభివృద్థిలో రాయలసీమ బాగా వెనుకబడిపోయిందని, దుగ్గరాజపట్నం, జాతీయ సంస్థల ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు పనుల వేగవంతం వంటి విషయాలపై త్వరలో హైదరాబాదులో ఇంటలెక్చువల్ ఫోరం సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు.
తిరుమల శ్రీవారి పవిత్రతను దెబ్బతీసేలా టిడిపి, బిజెపి నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తిరుమలలో ఏం జరిగినా వెంటనే పరిష్కరించుకోవాలే తప్ప రోడ్డుపైకి తీసుకురావడమనేది మంచిది కాదన్నారు. శ్రీవారి వద్ద పనిచేసే అర్చకుల్లో కూడా గ్రూపు రాజకీయాలు ఉండటం బాధాకరమన్నారు జయప్రకాష్ నారాయణ్. తిరుపతిలోని వెటర్నరి విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో జయప్రకాష్ నారాయణ్ పాల్గొన్నారు.